హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు కేసీఆర్ ప్రారంభించిన 1962 -సంచార పశువైద్య వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు సైతం పొంది దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన గొప్ప కార్యక్రమాన్ని గాలికి వదిలేసి మూగజీవుల రోదనకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమవుతున్నదని విమర్శించారు. ఓ వైపు వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతున్నదని, మరోవైపు వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబ పోషణ భారంగా మారి ఆవేదన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, సిబ్బందికి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.