Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం, కాలేజీలను నడిపే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలోని 19 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేతకు చేరువలో ఉన్నాయి. ఆర్థికంగా కుదేలైన ఈ కాలేజీల యాజమాన్యాలు భారాన్ని భరించలేక క్లోజ్ చేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీటితోపాటు 3 బీఫార్మసీ, 8 ఎంఫార్మసీ, 18 ఎంబీఏ, 13 బీఈడీ, 4 బీఆర్క్, 6 ఎల్ఎల్బీ, 2 ఎంటెక్ కాలేజీలు ఇదేబాటలో సాగుతున్నాయి. ఈ కాలేజీలు 2025-28 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి ఫీజుల సవరణకు టీఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేయలేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఫీజులు ఖరారుచేసిన కాలేజీల్లోనే అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల్లో కొత్త అడ్మిషన్లకు అవకాశముండదని టీఏఎఫ్ఆర్సీ వర్గాలంటున్నాయి.
బకాయిలు విడుదల చేయకపోవడంతో..
రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీల్లో 2022-25 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి ఫీజులను సవరించారు. 2025-28 బ్లాక్ పీరియడ్‌కు సవరించాల్సి ఉన్నది. ఇందుకు టీఏఎఫ్ఆర్సీ కాలేజీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. వాస్తవానికి ఫీజులు పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించమంటే కాలేజీ యాజమాన్యాలు సంతోషపడాలి. కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం, రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడంతో కాలేజీలు నడపలేని పరిస్థితలో చేతులెత్తేస్తున్నాయి. దాదాపు 4,500 కోట్లకుపైగా ఫీజు బకాయిలు రావాల్సి ఉన్నది. కనీసం టోకెన్లు జారీ అయిన రూ.850 కోట్లు విడుదల చేయమని యాజమాన్యాలు కోరుతున్నాయి. కానీ, ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. గతంలో డిగ్రీ కాలేజీలు రెండు సార్లు బంద్ పాటించాయి. ఫార్మసీ, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ప్రెస్‌మీట్ పెట్టి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అయినా ప్రభుత్వం బకాయిలను విడుదల చేయలేదు. దీంతో ఈ కాలేజీల అనుమతులు, ఫీజుల పెంపు డోలాయమానంలో పడింది.