హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఓ వైపు ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు డెల్టా వేరియంట్ ప్రభావం పూర్తిగా కనుమరుగు కాలేదు. సంక్రాంతి నుంచి కరోనా కేసులు పెరుగవచ్చని అనేక అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కలిపి 25,390 పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చింది. ఆక్సిజన్ కొరత రాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నది. ఈ క్రమంలోనే మాస్కులు, పీపీఈ కిట్లు వంటి అత్యవసర వస్తువులు, రెమ్‌డెసివిర్ వంటి ప్రాణాధార ఔషధాలు, పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వంటి కొవిడ్ చికిత్సకు వినియోగించే ఔషధాలను తగిన సంఖ్యలో నిల్వ చేస్తున్నది. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సర్వ సన్నద్ధంగా ఉన్నదని అధికారులు చెప్తున్నారు.
188 మందికి వైరస్ పాజిటివ్
రాష్ట్రంలో శనివారం కొత్తగా 188 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 78 కేసులు, కరీంనగర్లో 15, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 12 చొప్పున కేసులు వెలుగుచూశాయి. 193 మంది కోలుకొని డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 3,891 మంది చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రిస్క్ దేశాల నుంచి శనివారం 532 మంది వచ్చారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. వారి నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం రికార్డుస్థాయిలో 4.37 లక్షల కొవిడ్ టీకాలు వేశారు. ఇందులో 1.64 లక్షల మందికి మొదటి డోస్ వేయగా, 2.72 లక్షల మందికి రెండో డోస్ వేశారు. దీంతో మొత్తం టీకాల సంఖ్య 4.11 కోట్లుగా నమోదైంది. రాష్ట్రంలో 49.60 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.