Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం, హ్యామ్) రోడ్లకు ఏజెన్సీలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా వస్తాయనే నమ్మకం ఏజెన్సీల్లో ఏమాత్రం లేకపోవడంతో ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో వానాకాలంలో పాడైన రోడ్లకే ఇంత వరకు మరమ్మతులు చేపట్టపోగా, చేపట్టిన రోడ్ల మరమ్మతు పనులకు సంబంధించి సుమారు రూ. 1000 కోట్ల వరకు బిల్లులు ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు హ్యామ్ రోడ్లకు తాము మళ్లీ పెట్టుబడి పెడితే అవి ఎప్పటికీ వసూలవుతాయో అని ఏజెన్సీల సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
రోడ్ల మరమ్మతులకు అత్తెసరు నిధులు..
నిరుడు కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో రోడ్లకు భారీగా నష్టం వాటిల్లిన విషయం విదితమే. దీంతో ఖమ్మం జిల్లాతో సహా వివిధ జిల్లాల్లో కేంద్ర బృందం కూడా నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటించింది. ఆర్అండ్బీ శాఖ రోడ్ల నష్టాన్ని అంచనా వేసి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. సుమారు 2553 కిలో మీటర్ల మేర రోడ్లకు నష్టం జరిగినట్లు, 902 హైలెవల్ బ్రిడ్జీలు, 391కల్వర్టులు, 166 బ్రిడ్జీలకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. శాశ్వత మరమ్మతులకు రూ. 2462 కోట్లు, తాత్కాలిక మరమ్మతులకు రూ.100 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం మాత్రం రూ. 15 కోట్ల అత్తెసరు నిధులతో సరిపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్లాన్ నిధుల కింద రూ. 518కోట్లు, నాన్ ప్లాన్ కింద రూ. 888 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా స్పిల్ ఓవర్ నిధులు కూడా భారీగానే బడ్జెట్లో చూపించారు.
హ్యామ్కు నిధులెక్కడ?
ఇదిలావుండగా, తమతమ నియోజకవర్గాల్లో కొత్త రోడ్లతోపాటు ఇప్పటికే ఉన్న రోడ్ల విస్తరణ, ముంపు ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం తదితర పనుల కోసం ఎమ్మెల్యేల నుంచి ఆర్అండ్బీకి భారీగా ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పనుల విలువ సుమారు రూ. 15,000 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా నిధులు మంజూరు కాలేదు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
మరమ్మతు బిల్లులకే దిక్కులేదు..
ఎమ్మెల్యేల వినతుల ప్రకారం నియోజకవర్గాల్లో రోడ్లు, కల్వర్టుల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణ పనులకు రూ. 15,000 కోట్లు, వానాకాలంలో పాడైపోయిన రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణకు మరో రూ. 2562 కోట్లు కలుపుకొని మొత్తం 17.5 వేల కోట్లకుపైగా నిధులు కావాల్సి వుంది. ప్రభుత్వం హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ, నిర్వహణ తదితర పనులు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి అయ్యే వ్యయంలో ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే మరమ్మతుల బిల్లులకే దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా రోడ్లకు ప్రభుత్వం 40శాతం నిధులు ఎక్కడి నుంచి ఇస్తుందని ఏజెన్సీలు ప్రశ్నిస్తున్నాయి.
ఇదీ హ్యామ్ విధానం…
ఇది పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో రోడ్డు పనులు చేపట్టే విధానం. ప్రాజక్టు వ్యయంలో 40 శాతం ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా కొంత చొప్పున గ్రాంట్ల రూపంలో అందించనుండగా, మిగిలిన 60 శాతం సంబంధిత ఏజెన్సీలు రుణం రూపంలోనో లేక ఈక్విటీ రూపంలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారు పెట్టిన పెట్టుబడి వడ్డీతోపాటు ఏటా ప్రభుత్వం చెల్లిస్తుంది. లేనిపక్షంలో టోల్ విధానంలో వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారిత గడువు వరకు, సుమారు 15 పాటు ప్రాజక్టు నిర్వహణ బాధ్యత కూడా సంబంధిత ఏజెన్సీపైనే ఉంటుంది. అయితే, దీనికి అయ్యే ఖర్చు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
బడ్జెట్లో రోడ్ల కేటాయింపుల వివరాలు..