Paddy Bags | కల్వకుర్తి, ఏప్రిల్ 4: వ్యవసాయ శాఖ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచిన దాదాపు 15 వేల వడ్ల బస్తాలు చోరీకి గురైన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకున్నది. కల్వకుర్తి పట్టణంలో జూలూరి రమేశ్‌బాబుకు పారా బాయిల్డ్ మిల్లు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సీఎమ్మార్‌లో భాగంగా రైస్ మిల్లులకు దాదాపు లక్షన్నర బస్తాల ధాన్యం కేటాయించింది. నిల్వ చేసేందుకు గోదాంలు లేకపోవడంతో వ్యాపారి రమేశ్‌బాబు వెల్దండ మండలం పెద్దాపూర్ వద్ద ఉన్న వ్యవసాయ శాఖకు చెందిన గోదాంలో ధాన్యం నిల్వ చేశాడు.
నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలకు వ్యాపారి అద్దె చెల్లించడం లేదని మార్కెటింగ్ అధికారులు గోదాంకు తాళం వేశారు. అయితే.. ఇటీవల కాలంలో చిన్నంబావి, బల్మూరు, కోడేరు మండలాల్లో ధాన్యం చోరీ జరిగిన సంఘటనలు వెలుగులోకి రావడంతో.. మార్కెటింగ్ అధికారులు అనుమానంతో బుధవారం సాయంత్రం గోదాం వద్దకు వచ్చారు. గోదాం షెట్టర్లు తెరిచి ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని వ్యాపారి రమేశ్‌బాబుకు తెలియజేశారు. ఆయన వచ్చి చూడగా.. 15 వేల వడ్ల బస్తాలను ఎత్తుకెళ్లినట్టు గుర్తించాడు. ఈ మేరకు పోలీసులు, సివిల్‌సైప్లె అధికారులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. గోదాముల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.