వాళ్లంతా పొట్ట చేతపట్టుకొని రాష్ట్రం దాటి ఇక్కడికి వచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో కుదిరారు. టన్నెల్లో దినదిన గండంగా సాగే వారి పనులు ఒకెత్తయితే.. ఎలాంటి వసతులూ లేకుండా అక్కడ బతుకెళ్లదీస్తుండటం మరోఎత్తు. తుప్పుపట్టిన రేకుల షెడ్డులో 150 మంది కార్మికులు నివాసముంటున్నారు. ఒక్కో గదిలో పది మందిదాకా నక్కినక్కి గడుపుతున్నారు. తంతెలవారీగా రేకులు అడ్డంపెట్టి కట్టిన బెడ్లలో కంటికి చాలని కునుకుతీస్తూ బతుకుజీవుడా అంటూ నెట్టుకొస్తున్నారు.
SLBC Tunnel | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : జార్ఖండ్‌లోని అత్యంత వెనుకబడిన కార్మిక కుటుంబాలవి. రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు వారివి. రో జుకు రూ.450 కూలి ఇస్తామంటే జార్ఖండ్ నుంచి 1500 కిలోమీటర్లు పొట్టచేతపట్టుకొని దోమలపెంటకు వచ్చారంటే వారెంత దీనావస్థలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి అమాయకుల బతుకులను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) అనే మృత్యుకుహరంలోకి నెట్టాయి కాంగ్రెస్ ప్రభుత్వం.. నిర్మాణ సంస్థ అయిన జేపీ అసోసియేట్స్. ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచి వారి పరిస్థితి ‘లోపల మృత్యు కుహరం.. బయట నరకకూపం’ అన్నట్టుగా ఉన్నది. రోజుకు మూడు షిఫ్టులు. ఓపిక ఉన్న కార్మికులు ఓటీ చేస్తే.. పది గంటల పనికి వచ్చే కూలి రూ.600! కార్మిక చట్టాలే తల దించుకునేం త శ్రమ దోపిడీ జరుగుతున్నా నోరెత్తి ప్రశ్నించలేని వెత లు వారివి.
నరకకూపంలా రేకుల షెడ్డు
కార్మికుల వసతి కోసం జేపీ అసోసియేట్స్ కంపెనీ ఎప్పుడో నిర్మించిన తుప్పు పట్టిన రేకుల షెడ్డులోనే సు మారు 150 మందికి పైగా కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కో షిఫ్టునకు 50 మంది విధుల్లో ఉండాలి. మూడు షిఫ్టుల్లో సుమారు 14 కిలోమీటర్ల మేర ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లి శ్రమను ధారపోసి మృత్యుకుహరం నుంచి వచ్చి బయట నరకకూపంలో అడుగుపెడుతున్నారు. ఆ రేకుల షెడ్డులో 150 మందికి సరిపడా వసతుల్లేవు. ఒక్కో గదిలో 8 నుంచి 10 మంది సర్దుకుపోతున్నారు. రేకులను అడ్డం పెట్టుకొని గదులను వారే తయారు చేసుకున్నారు. ఒక్కో గదిలో మూడు తంతెలు వేసుకొని, రేకులతో బెడ్‌గా రూపొందించుకున్నారు. డ్యూటీకి వెళ్లొచ్చిన తర్వాత అన్నం ఉంటే తింటారు.. లేదంటే పస్తులుంటారు. ఇక రాత్రయితే అడవిలోని దోమలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కనీసం వంటగ్యాస్ సౌకర్యం కూడా లేకపోవడంతో అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చుకొని వంట చేసుకుంటున్నారు. మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లేవారు, రాత్రికి డ్యూటీకి వెళ్లాల్సిన వారిదే వంట బాధ్యత. మిగతా కార్మికులు ప్రాజెక్టుకు దగ్గర్లోని దోమలపెంటకు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వంట సామాను తెస్తారు. అప్పుడెప్పుడో కట్టించిన మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. బయలుకొస్తే అడవిలోకి వెళ్లాల్సిందే. కనీసం స్నానాలు చేసేందుకూ వసతులు లేవు.
అంబులెన్స్, వైద్యానికీ డబ్బులు!
టన్నెల్లో పనిచేసే చోట, రేకుల షెడ్డులో, అడవిలో ఏవైనా దెబ్బలు తగిలితే వెంటనే జయ్పీ కంపెనీ తమ అంబులెన్స్‌ను పంపిస్తుందట! అయితే, ఆ అంబులెన్స్‌కు, చేసిన వైద్యానికి కూడా కార్మికులే డబ్బు చెల్లించాలట! ఇక ఏదైనా సీజనల్ రోగాలొసే తమను డబ్బులకు పీల్చి పిప్పి చేస్తున్నారని కార్మికులు చెప్తున్నారు. ఈ దారుణాలేవీ పైస్థాయిలో ఉన్నవారికి తెలియనివ్వరని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
3 నెలలుగా వేతనం పెండింగ్
ఇంతలా శ్రమ దోపిడీ చేస్తున్న కంపెనీ మూడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వలేదని, అడిగితే భయపెడుతున్నారని కార్మికులు వాపోతున్నారు. ‘మావాళ్లను పోగొట్టుకున్నం.. మాకు రావల్సిన వేతనాలు ఇప్పిస్తే.. ఇప్పుడే ఇంటికి వెళ్లిపోతం’ అంటూ వేడుకుంటున్నారు.
బతుకుజీవుడా’ అంటూ సొంతూళ్లకు తోటి కార్మికులు కళ్లముందే మట్టిలో గల్లంతవడంతో ఆ దృశ్యాలను చూసి భయకంపితులైన కొందరు కార్మికులు ‘బతుకు జీవుడా’ అంటూ ఉన్న డబ్బుతో సొంతూళ్లకు వెళ్లారు. ఇప్పటికే సుమారు 130 మంది జార్ఖండ్‌కు వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ ప్రమాదం గురించి వార్తల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చార్జీలకు డబ్బులు ఫోన్‌పే చేయడంతో ఇక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇక మిగిలిన 20 మంది కార్మికులు సొంతూరికి వెళ్లేందుకు డబ్బుల్లేక ఇక్కడే ఉన్నట్టు తెలిసింది. వారిని రెస్క్యూ సిబ్బందికి సహయంగా ఉండాలని అధికారులు చెప్పారని, ఇంత ప్రమాదం జరుగుతున్నా.. మళ్లీ పనికి పిలుస్తున్నారని, వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని కార్మికులు అంటున్నారు.
టన్నెల్లో ఏం జరుగుతున్నదో తెలియడం లేదు
గద్వాల, ఫిబ్రవరి 28: మా బిడ్డ ఆపరేటర్‌గా ఇదే టన్నెల్లో పనిచేస్తున్నడు. ప్రమాదంలో చిక్కుకొని వారం అవుతున్నది. ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లేదు. టన్నెల్లో అసలేం జరుగుతున్నదో మాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని లోపలికి పంపాలని ఎం త వేడుకున్నా కలెక్టర్ సారు ఒప్పుకోవడం లేదం టూ సిబ్బంది పంపట్లేదు. బిడ్డ ఎప్పుడొస్తడని గురుప్రీత్‌సింగ్ తల్లి, నాన్నెప్పుడొస్తడని ఇద్దరు ఆ డపిల్లలు, కట్టుకున్నోడి రాక కోసం భా ర్య.. ఇం ట్లో అందరూ ఏడుస్తూ ఎదురు చూస్తున్నరు. ఇ ల్లంతా కునుకు లేదు.. తిండి లేదు. ప్రభుత్వం సహాయక చర్యలు మరింత వేగం చేయాలి.
-కల్వంత్సింగ్, సొరంగంలో చిక్కుకున్న గురుప్రీత్‌సింగ్ బాబాయి, పంజాబ్
మా వాళ్లు వద్దన్నా.. తీస్కపోయిండ్రు
మేం డ్యూటీకి వెళ్తుండగానే టన్నెల్ పైనుంచి మట్టి, నీరు లీకవుతున్నాయని లోపలికి వెళ్లవద్దని రాతి షిఫ్ట్ వారు మాకు చెప్పారు. అటువంటిదేమీ లేదని, అవి చాలా సహజమని అధికారులు వచ్చి చెప్పి మా వాళ్లను పనికి తీసుకెళ్లారు. వాళ్లు అనుకోని ప్రమాదానికి గురై ఆ టన్నెల్‌లోనే ప్రాణాలు కోల్పోయారని మాకు ఇప్పటికే అర్థమమైంది. అకడ ముందుగా మట్టి పడడం మొదలైంది. ఆ తర్వాత నీరు బయటకు వచ్చింది. అప్పటికే మాకు భయమైంది. పెద్ద శబ్దం వస్తుండటంతో మేము ముగ్గురం కలిసి భయంతో ఉరుకుతూ బయటికి వచ్చినం. మా వాళ్లు చెప్పినా అధికారులు వినలేదు. అందుకే పెద్దనష్టం జరిగింది.
-బిశ్వజిత్ సాహు, కార్మికుడు, జార్ఖండ్
దేవుడి మీదే భారం వేసినం
ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా కనీసం తట్టెడు మట్టి బయటికి తీయకపోవడం మమ్మల్ని బాగా బాధిస్తున్నది. మా వాళ్లు బతికి ఉండటం కష్టమే. ఇంతపెద్ద టన్నెల్లో పనిచేసే వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. మాకు అలాంటిదేమీ ఇవ్వలేదు. పనిచేసేటప్పుడు మేము రోజూ దేవుడి మీదే భారం వేస్తున్నం. మొదట భయపడ్డా తర్వాత అలవాటైంది. కానీ ఈ ప్రమాదంలో మాతోపాటు పనిచేసిన వాళ్లు గల్లంతవడం తట్టుకోలేకపోతున్నం. వాళ్లను బతికించే ప్రయత్నాలు సరిగ్గా చేయలేదు.
-విజయ్ సిన్హా, కార్మికుడు, జార్ఖండ్