హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మక్కల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే వెయ్యి టన్నులకు పైగా మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 150 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, రూ.5 కోట్ల విలువైన 2,500 టన్నుల మక్కలను కొనుగోలు చేసింది. ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగైంది. తొలుత భారీగా ధర పలికినా.. తర్వాత పడిపోయింది.
కనీస మద్దతు రూ.1,962 వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీనికి తోడు అకాల వడగండ్ల వర్షాలతో మక్కజొన్నకు నష్టం జరిగింది. ఓవైపు పంట నష్టం, మరోవైపు ధర పతనంతో మక్క రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి విపత్కర సమయంలో మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతుల్లో భరోసా నింపారు.