హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కులగణన (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలు) నిర్వహణకు రూ.150 కోట్లను మంజూరు చేస్తూ, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులగణన సర్వే కోసం రూ.150 కోట్ల అంచనాతో రాష్ట్ర బీసీ కమిషన్ చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదం మేరకు ప్రభుత్వ బడ్జెట్లో పొందుపర్చింది. ఆ మేరకు తాజాగా నిధులను విడుదల చేసింది. అయితే సర్వేను ఏ పద్ధతిలో, ఏవిధంగా నిర్వహించాలనే మార్గదర్శకాలను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. వాటిని తర్వాత ప్రత్యేకంగా విడుదల చేస్తామని ప్రకటించడం గమనార్హం. మార్గదర్శకాలు లేకుండా సర్వే ఎలా ముందుకు సాగుతుందని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.