హైదరాబాద్, మే 4 (నమస్తేతెలంగాణ): అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో వ్యవసాయ కూలీల పిల్లలకు 15% రిజర్వేషన్ కోటా కేటాయించారు. ఈ మేరకు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. ఇప్పటికే రైతుల పిల్లలకు 40%రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. కాగా దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక కోటా కేటాయించిన ఘనత తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీకే దక్కిందని వీసీ జానయ్య వెల్లడించారు.
భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీల పిల్లలకు 15% కోటా కేటాయించడం దేశంలోనే తొలిసారి అని వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య శనివారం వెల్లడించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఉపాధి హామీ పథకం జాబ్కార్డును ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఏటా 670 సీట్లు భర్తీ అవుతున్నాయి.
అందులో రైతన్నలకు చెందిన కుటుంబాల పిల్లలు 40% కోటా కింద 268 సీట్లు పొందుతున్నారు. రానున్న అకాడమిక్ ఇయర్లో 15% కోటా కింద భూమిలేని వ్యవసాయ కూలీల పిల్లలకు 100 వరకు సీట్లు రానున్నాయి. మిగిలిన 25 శాతం కింద రైతు కుటుంబాలకు 168 సీట్లు లభించనున్నాయి. వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి విద్యార్థులు రాని పక్షంలో ఈ సీట్లు సైతం రైతు కుటుంబాలవారే పొందేందుకు అవకాశం ఉంటుంది.