
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 15 ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేశామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమశిల, సింగోటం రిజర్వాయర్లు, అక్కమహాదేవి గుహలు, ఈగలపెంట, మన్ననూర్, మల్లెలతీర్థం, ఉమామహేశ్వర దేవాలయం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగత జలపాతం, పాకాల, అలీసాగర్, జోడెఘాట్ సమీపంలో కుమ్రంభీం పార్కులను ఇప్పటికే ఎకో టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దామని తెలిపారు.
ఎస్సీలకు మినీ డెయిరీ ప్రాజెక్టు
సన్నకారు రైతులుగా ఉన్న ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మినీ డెయిరీ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు 3,590 మంది దళిత రైతులు లబ్ధిపొందారని చెప్పారు. ఇర వై గుంటల భూమి ఉన్న రైతుకు 60 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకు రుణం కలిపి రూ.4 లక్షలతో నాలుగు పాడి పశువులను అందజేస్తున్నామని తెలిపారు.
బీడీ కార్మికులను ఆదుకుంటున్నాం
బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీతో బీడీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు. 48శాతం జీఎస్టీ విధించడం వల్ల బీడీ పరిశ్రమ యజమానులు ఉత్పత్తిని తగ్గించుకున్నారని, ఫలితంగా బీడీ కార్మికుల ఉపాధి తగ్గిందని వివరించారు. బీడీ కార్మికులను ఆదుకునేందుకు రూ.2,016 పింఛన్ అందిస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమానికి అమలుచేస్తున్న బీమా పథకాలను వర్తింపజేస్తున్నట్టు వివరించారు. బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకుంటే అర్హులైనవారికి డబుల్బెడ్రూం ఇండ్ల పథకంలో ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టంచేశారు.
వైద్యరంగంలో గుణాత్మక మార్పు
రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖలో గుణాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రతి ప్రభుత్వ దవాఖానను బాగు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైద్యారోగ్యశాఖకు 12,289 కొత్త పోస్టులను మంజూరు చేశామని, ఐదేండ్లలో రూ.1,158 కోట్లతో పలు వైద్య సేవల అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.
రైతుబీమాతో కుటుంబానికి ధీమా
రైతుబీమాతో వ్యవసాయ కుటుంబాలకు ధీమా పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు 45 వేల మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము చెల్లించినట్టు చెప్పారు. రైతుబీమాను కౌలుదారులకు వర్తింపజేయాలన్న దానిపై చర్చ జరగాల్సి ఉన్నదని, ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వీలయినంత ఎక్కువ మందికి లబ్ధిచేకూరేలా చూస్తామని వెల్లడించారు.
రంజాన్‌కు ముందే మసీదు శంకుస్థాపన
రంజాన్కంటే ముందే సచివాలయంలో నూతన మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. గతంలో 435 గజాల్లో ఉన్న మసీదుకు ఇప్పుడు 1500 గజాలు, దేవాలయానికి 1500 గజాలు, చర్చికి 500 గజాల స్థలం కేటాయించామని తెలిపారు.
చేపల విక్రయానికి మొబైల్ ఔట్లెట్స్
ప్రజలకు తాజా చేపలతోపాటు చేపల వంటకాలను అందించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫిష్ ఔట్లెట్లను ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు. జీహెచ్ఎంసీలో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 ఔట్లెట్స్ వస్తాయన్నారు. ఉదయంవేళ చేపలు, సాయంత్రంవేళ చేపల వంటకాలను విక్రయించుకొనేందుకు మత్స్యకారులకు ఈ వాహనాలు ఉపయోగపడుతాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చిన్నతరహా సాగునీటి చెరువులకు 100శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో శనివారం 117 మంది లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్‌యాదవ్ వాహనాలను పంపిణీ చేయనున్నారని మత్స్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.