హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సాయంత్రానికే 15.60 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. రేషన్‌కార్డు లేక, ఆదాయం సర్టిఫికెట్లు మంజూరుకాక లక్షలాది మంది దరఖాస్తు చేసుకోనట్టు తెలిసింది. రాజీవ్ యువవికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ తదితర వర్గాలకు రూ.6వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా అందిస్తామని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
దరఖాస్తుల స్వీకరణను మార్చి 24న ప్రారంభించగా, తొలుత ఈనెల 5 వరకే గడువు విధించింది. ఆ తరువాత 14వ తేదీ వరకు పొడిగించింది. ‘రాజీవ్ యువ వికాసం’ అని పేరు పెట్టినా 60 ఏండ్ల వరకూ అవకాశం కల్పించడంతో భారీగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ పథకం దరఖాస్తుకు రేషన్‌కార్డు లేదంటే ఆదాయం సర్టిఫికెట్‌ను సమర్పించాలనే నిబంధనను సర్కారు విధించింది. అయితే ఈ గడువును 24 వరకు పొడిగించినట్టు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నది. అధికారికంగా ప్రకటన రాలేదు.