నందికొండ, మార్చి 20 : పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నందికొండ పైలాన్ కాలనీలోని తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ చందనాదీప్తి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నందికొండలోని సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వ్యాన్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా 1,450 కిలోల జిలెటిన్ స్టిక్స్‌ను, 300 మీటర్ల పొడవు గల సేఫ్టీ ఫ్యూజ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ నాగేంద్రబాబును అదుపులోకి తీసుకుని విచారించగా ఆధారాలు చూపకపోవడంతో విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు.