హైదరాబాద్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 2024-25 మార్చి నాటికి 1.24లక్షల మంది బాధితులు ఉండగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,43,173కు చేరడం ఆందోళన కలిగిస్తున్న ది. ఎయిడ్స్ బారిన పడిన వారికి ఏఆర్టీ సెంటర్లలో ప్రభుత్వం చికిత్స అందిస్తుండగా.. ప్రభుత్వం ట్రేస్ చేయని బాధితుల్లో కొంత మంది ప్రైవేటుతోపాటు ఇతర చికిత్సలు పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఎయిడ్స్ బారిన పడిన వారికి యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్వీ) మందు ఇస్తారు. ఏటా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడికి ఏఆర్టీ సెంటర్లో రక్త నమునాలు సేకరిస్తారు. వైరల్ లోడ్ టెస్ట్ చేస్తారు. ఒక వేళ వైరస్ కౌంట్ ఎక్కువ ఉన్నట్టయితే మందులను మారుస్తారు. తగ్గితే అవే మందులు కంటిన్యూ చేయాలని వ్యాధిగ్రస్థులకు సూచిస్తారు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే సీడీ-4 కణాలపై హెచ్ఐవీ వైరస్ దాడి చేస్తాయి. వైరస్ దాడిని తగ్గించేందుకు ఏఆర్టీ సెంటర్లలో మందులు ఇస్తారు.
వ్యాధిగ్రస్థులను ట్రేస్ చేయడానికి వ్యవస్థ
ఎయిడ్స్ కట్టడికి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీశాక్)తో ఎన్జీవోలు భాగస్వామ్యమై పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 63 ఎన్జీవోలు ఉండగా.. హెచ్ఐవీపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించడం, హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వారికి మద్దతుగా నిలవడం వీరి పని. రాష్ట్రంలో ఎయిడ్స్‌తో మరణాల రేటు 2023లో44గా ఉండగా 2025 నాటికి 41 శాతానికి తగ్గినట్టు అధికారులు తెలిపారు.