ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలివాన విరుచుకుపడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. ఆదివారం కురిసిన వర్షానికి భీకర గాలులు తోడై అనేకచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు, రేకుల షెడ్లు నేలకూలాయి. వేర్వేరు చోట్ల షెడ్లు, భారీ వృక్షాలు కూలి, సిమెంట్ ఇటుకలు మీద పడి 11 మంది చనిపోగా, పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం రాసులు తడిసిముద్దయ్యాయి. మామిడి నేల రాలగా.. పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలివాన కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగగా, అనేక ప్రాంతాల్లో వైర్లు తెగిపడి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 26: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురు గాలులకు తోడు వర్షం కురవడంతో చాలాచోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతోపాటు, గోడలు కూలాయి. అనేకచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా 14 మంది మరణించారు. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాట్లకు కూడా ప్రాణనష్టం సంభవించింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్లోని మునిరంగస్వామి ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం నేలకొరిగింది. కోస్గిలోని రామాలయం చౌరస్తా వద్ద ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభం విరిగి కరెంట్ తీగలపై పడింది. నవాబ్‌పేట మండలం ఇప్పటూర్‌లో ఓ హోటల్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా వీచిన గాలిదుమారంతోపాటు కురిసిన వర్షానికి నల్లగొండ జిల్లాలోని పలుచోట్ల తీవ్ర నష్టం జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు కనగల్, కట్టంగూర్, పెద్దవూర, అనుముల మండలాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. నల్లగొండ-కట్టంగూర్ రోడ్డులో పెద్ద సంఖ్యలో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నల్లగొండలోని పానగల్ ైప్లెఓవర్ సమీపంలో ఓ లాడ్జి ఎలివేషన్ విరిగి పడటంతో విద్యుత్తు వైర్లు తెగిపడ్డాయి. దాంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు చాలాచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. హాలియాలో పిడుగుపాటుకు గంగిరెద్దు, పెద్దవూర మండలం పులిచర్లలో రెండు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. గుడిపల్లి మండలం నడిమిబావిగూడెంలో ఓ ఇంట్లోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడగా మంట లు చెలరేగాయి. కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లిలో పిడుగుపాటుకు గడ్డివాము దగ్ధమైంది. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌తోపాటు పలుచోట్ల ధాన్యం తడిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండలాల్లో గాలిదుమారం తీవ్రనష్టం వాటిల్లింది. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో 15 గృహ, 10 వ్యవసాయ విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. సుమారు 20 ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బాన్సువాడ- కామారెడ్డి ప్రధాన రహదారిపై కొయ్యగుట్ట వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది. బాన్సువాడ మినీ ట్యాంక్‌బండ్ వద్ద సోలార్ హైమాస్ట్ లైట్ స్తంభాలు పడిపోయాయి. రుద్రూర్ మండలం అంబంలో చెట్టు విరిగి ఇంటి మీద పడింది.
అంబం శివారులో భారీ వృక్షం కూలి ఒక ఆటో, రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్, జామిడి, వడ్డాడి గ్రామాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. హస్నాపూర్, ఉండం, సుంకిడి మీదుగా మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం నేలకొరగడంతో గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో ఎడ్లబండిపై పిడుగు పడటంతో రెండు ఎడ్లు మృత్యువాతపడ్డాయి. రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తచెడువాయిలో పిడుగుపాటుకు గడ్డివాము దగ్ధమైంది. దహెగాం మండలం లగ్గాం గ్రామం లో విద్యుత్తు షాక్‌తో ఎద్దు మృత్యువాతపడింది.
14 మంది మృతి..