సుబేదారి, ఏప్రిల్ 24: మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో గురువారం లొంగిపోయారు. మల్టీజోన్ డీఐజీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో ఇద్దరు చత్తీస్‌గఢ్‌కు చెందిన ఏరియా కమిటీ సభ్యులున్నారు. వీరిలో మడవి అంద అలియాస్ రాజేశ్.. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌కి ప్రొటెక్షన్ టీం సభ్యుడిగా పనిచేశాడు. లొంగిపోయిన వారిలో మరో ఏరియా కమిటీ సభ్యురాలు పోడియ కోసి, మిలిషియన్ సభ్యులు మరకం హిడమే అలియాస్ కోవాసి, పోడియం భూమిక అలియాస్ సోడి కోసి, సోడి బుద్రి ఆలియాస్ బద్రి, మడవి పూజే, హేమ్లా సోను, సోడి రమేశ్, బుద్ర, కోర్సా లాలు, హేమ్లా బుద్ర, మేమ్లా సుక్కు, కోర్సా సుక్కు ఉన్నారు.
గత ఏడాది నుంచి ఇప్పటివరకు 250 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మావోలు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాసాన్ని కల్పిస్తుందని చెప్పారు. 14 మందికి రూ.25 వేల చొప్పున రివార్డును ఆయన అందజేశారు. మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్‌తో తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కర్రెగుట్ట ఆపరేషన్‌పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. కర్రెగుట్ట ఆపరేషన్‌లో కేంద్ర బలగాలు మాత్రమే పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌తో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదని, దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని స్పష్టంచేశారు. తెలంగాణ నుంచి ఇంకా 95 మంది అజ్ఞాత జీవితంలో ఉన్నారని డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ పాల్గొన్నారు.