హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.1,377 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 92 నియోజకవర్గాల్లో 1,323 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించనున్నారు. తొలి దశలో రూ.400 కోట్లు విడుదల చేయనున్నామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించిన రూ.1,300 కోట్ల నిధులు విడుదల కాకపోవడంతో ఇప్పటికే మాజీ సర్పంచ్‌లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమ పదవీ కాలం ముగిసినప్పటికీ గౌరవ వేతనాలను కూడా పూర్తిగా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మంథని నియోజకవర్గంలో మానేరుపై రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 97.91కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.