హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రవాణాశాఖ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతున్నదని తెలిపారు. 2014-15లో 72 లక్షల వాహనాలు ఉండగా, ఆదాయం రూ. 1,864 కోట్లని, 2022-23 నాటికి రూ.1.53 కోట్ల వాహనాలతో జనవరి, 2023 నాటికి రూ.5,304 కోట్లు ఆదాయం వచ్చినట్టు తెలిపారు. మార్చి నాటి కి రూ.6,375 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, రవాణాశాఖ రెవెన్యూ వసూలు వృద్ధిరే టు 240 శాతంగా ఉన్నదని, వాహనాల సంఖ్య 112 శాతం పెరిగిందని వెల్లడించారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఇప్పటి వరకు రూ.231 కోట్లు సమకూరాయని చెప్పారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ పాల సీ కింద 52,335 ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయించినట్టు తెలిపారు. సంస్థ లాభాలను దృష్టిలో ఉంచుకొని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి త్వరలోనే పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు.
ఆర్టీసీలో నష్టాలు తగ్గించాం
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించినందుకు మంత్రి అజ య్ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆర్టీసీకి రోజు వారి ఖర్చు రూ.18.07 కోట్లని చెప్పారు. ఈ జనవరి 2023 వరకు నష్టం రూ.542.36 కోట్లకు గణనీయంగా తగ్గించుకున్నట్టు చెప్పారు.
కొత్త బస్సుల కొనుగోలు
ప్రయాణికుల సౌకర్యార్థం సీసీ కెమెరాలు, లొకేషన్, ట్రాకింగ్ సిస్టమ్, ఫైర్ డిటెక్షన్, అలారమ్ సిస్టమ్ మొదలైన అధునాతన సౌకర్యాలున్న 776 కొత్త బస్సులను కొన్నట్లు మంత్రి తెలిపారు. వీటిల్లో 630 సూపర్ లగ్జరి, 130 డీలక్స్, దూర ప్రాంతాలకు 16 ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 40 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లో ప్రవేశపెట్టామని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 1360 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు.
కార్గో సేవలు విస్తృతం
365 ప్రైవేట్ ఏజెంట్లను నియమించడంతో పాటు 88 బస్స్టేషన్లలో కార్గో, పార్సిల్ కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. జూన్ 2020 నుంచి డిసెంబర్ 2022 వరకు 107.19 లక్షల పార్సిళ్లను రవాణా చేసి రూ.172.21 కోట్ల ఆదా యం ఆర్జించామని తెలిపారు.