హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని 98.20 శాతం ఆవాసాలో ్ల (హ్యాబిటేషన్లు) ప్రాథమిక పాఠశాలలు, 94 శాతం ఆవాసాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలంగాణ సమగ్ర శిక్ష వార్షిక నివేదిక-2020 వెల్లడించింది. రాష్ట్రంలో కేవలం 2.8 శాతం ఆవాసాల్లో ప్రాథమిక పాఠశాలలు, 6 శాతం ఆవాసాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలు లేవని తెలిపింది. 2001 నుంచి 2020 వరకు తెలంగాణలో కొత్తగా 3,090 ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆరేండ్లలో 136 ఆవాసాల్లో కొత్త పాఠశాలలను ప్రారంభించినట్టు పేర్కొంది. 2014 నాటికి రాష్ట్రంలో 25,160 ఆవాసాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 500 ఆవాసాల్లో స్కూళ్లు లేవు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో 39 ఆవాసాల్లో పాఠశాలలు నెలకొల్పారు. దీంతో ప్రాథమిక పాఠశాలలున్న ఆవాసాల సంఖ్య 25,199కి పెరిగింది. పాఠశాలలు లేని ఆవాసాల సంఖ్య 461కి తగ్గింది. హైదరాబాద్ జిల్లాలోని అన్ని ఆవాసాల్లో పాఠశాలలున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉన్నదని నివేదిక వివరించింది. గతంలో మూతపడ్డ 212 పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో తిరిగి తెరవడం విశేషం. పాఠశాలలు లేని ఆవాసాల్లో ప్రాథమిక స్థాయిలో 4,393 మంది, ప్రాథమికోన్నత స్థాయిలో 15,619 మంది విద్యార్థులు ఉండగా, వీరిని సమీప పాఠశాలల్లో చేర్పించి, ప్రతి నెలా రవాణా భత్యం అందజేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.