Civils Results | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)/ ఖిలావరంగల్/హనుమకొండ/అచ్చంపేట/వంగూరు/వెల్దండ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వెలువరించిన సివిల్స్-2024 తుది ఫలితాల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పండింది. ఈసారి తెలంగాణ అభ్యర్థులు సత్తాచాటారు. రాష్ర్టానికి చెందిన ఎట్టబోయిన సాయిశివాని 11వ ర్యాంకు సాధించింది. వరంగల్‌కు చెందిన రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన చింతకింది శ్రావణ్‌కుమార్‌రెడ్డి 62వ ర్యాంకు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చైతన్యజాదవ్ 68వ ర్యాంకుతో అదరగొట్టారు. టాప్-10లో ఒక్కరు కూడా తెలంగాణకు చెందిన వారు లేరు. తెలంగాణ, ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్‌కు 78 మంది ఎంపికైనట్టు లా ఎక్స్‌లెన్స్ డైరెక్టర్ రాంబాబు పాలడుగు అంచనావేశారు. టాప్-100లో 13 మంది తెలుగు విద్యార్థులున్నట్టు విశ్లేషించారు. ఎంపికైన వారిలో 50 శాతానికి పైగా ఇంజినీరింగ్ గ్రా డ్యుయేట్లే కాగా, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి ఉన్నారు.
కోచింగ్ తీసుకోకుండా 11వ ర్యాంకు
వరంగల్ శివనగర్‌కు చెందిన సాయిశివాని కోచింగ్ తీసుకోకుండానే, సొంత ప్రిపరేషన్లో, నిపుణుల మార్గదర్శనంలో ఆలిండియా 11వ ర్యాంకు సాధించారు. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ పరీక్షలో జోనల్ వైజ్లోనూ 11వ ర్యాంక్ సాధించిన సాయిశివాని సివిల్స్‌లో కూడా అదే ర్యాంక్ సాధించింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన శివాని కొవిడ్ లాక్డౌన్లో సివిల్స్ ప్రయత్నం మొదలుపెట్టింది. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దశలోనే వెనుదిరిగింది. రెండో ప్రయత్నంలో మెయిన్స్‌కు వెళ్లింది. ఇంటర్వ్యూ సమయంలోనే మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యానని, మంచి ర్యాంకు వస్తుందని ఊహించా తప్ప ఆలిండియా 11వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదని ఆమె తెలిపింది.
కానిస్టేబుల్ కొడుకు.. కలెక్టర్ కాబోతున్నడు
నాన్న కానిస్టేబుల్. అమ్మ టీచర్. సివిల్స్ ప్రయత్నంలో ఐదు సార్లు విఫలమయ్యాడు. అయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. క్రమపద్ధతిలో హార్డ్వర్క్చేసి సక్సెస్ సాధించాడు సాయిచైతన్య జాదవ్. తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని, 68వ ర్యాంకు వస్తుందని ఊహించలేదని, ఆరేండ్ల కష్టానికి దక్కిన ఫలితమిదని సాయిచైతన్య తెలిపాడు.
మొదటిసారే మెరిసిన నల్లమల దళితుడు
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్వాసి సాయికిరణ్ 298వ ర్యాంక్ సాధించాడు. కోచింగ్‌కు వెళ్లకుండా డిగ్రీ చదువుతూనే ప్రిపేర్ అ య్యాడు. తండ్రి లింగయ్య పెద్దకొత్తపల్లి ఎంపీవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామ పేద దళిత కుటుంబానికి చెందిన గోకమోళ్ల ఆంజనేయులు 934వ ర్యాంక్ సాధించాడు.
సింగరేణి తోడ్పాటుతో ఏడుగురు సక్సెస్
సింగరేణి సంస్థ ప్రోత్సాహంతో ఏడుగురు అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం కింద సింగరేణి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. తొలి ఏడాది ఇట్టబోయిన సాయి శివాని, పోతరాజు హరిప్రసాద్, రాపర్తి ప్రీతి, బానోతు నాగరాజు నాయక్, తొగరు సూర్యతేజ, గోకమల్ల ఆంజనేయులు, రామటెంకి సుధాకర్‌కు సింగరేణి సహాయమందించగా, సివిల్స్‌కు ఎంపికయ్యారు.
ఐఏఎస్ కావాలని ఐదోసారి ప్రయత్నించా..
మాది హనుమకొండ. నాన్న రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడు. అమ్మ లక్ష్మి గృహిణి. ఐఏఎస్ కావాలన్న బలమైన కోరికతో ఐదోసారి సివిల్స్‌కు ప్రయత్నించా. స్టేట్ రెండో టాపర్(46వ ర్యాంక్)గా నిలవడం సంతోషం.
– రావుల జయసింహారెడ్డి, 46వ ర్యాంక్
పట్టుదలతో చదివి సాధించా..
మాది హనుమకొండలోని బాలసముద్రం. గతం లో రెండు సార్లు సివిల్స్ రాయగా ఇంటర్వ్యూ వరకు వెళ్లా. ఈ సారి పట్టుదలతో సివిల్స్ సాధించా. మా నాన్న పోతరాజు కిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ విజయ గృహిణి. కోచింగ్‌కు వెళ్లకుండా చదివా.
– హరిప్రసాద్, 255వ ర్యాంక్
సంతోషంగా ఉంది.
మాది వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా. గత ఏడాది 627 ర్యాంకు సాధించి మహారాష్ట్ర ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యా. శిక్షణలో ఉంటూనే మళ్లీ పరీక్షలు రాశా. 432 ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది.
– వడ్త్యావత్ యశ్వంత్ నాయక్, 432 ర్యాంక్
సాఫ్ట్వేర్ కొలువుచేస్తూ.. సాధించా
మా కుటుంబం కూకట్‌పల్లిలో ఉంటుంది. 2016లో ఓయూ నుంచి బీటెక్ సీఎస్ఈ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశా.2019లో సివిల్స్ ప్రిలిమ్స్ వద్దే ఆగిపోయా. రెండో ప్రయత్నంలోనే 451వ ర్యాంక్ రావడం సంతోషాన్నిచ్చింది. – రాపర్తి ప్రీతి, 451వ ర్యాంక్