హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఏపీలో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనల్లో 13 మంది చనిపోయారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో చందనోత్సవంలో స్వామి వారి నిజరూపాన్ని దర్శించేందుకు భక్తులు రూ.300 టికెట్ క్యూలెన్‌లో నిల్చున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సిమెంట్ గోడ కూలి భక్తులపై పడింది. ఈ విషాద ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను విశా ఖ కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా బుచ్చిరెడ్డిపాలెంలో తమ స్నేహితుడి అక్క పెళ్లినిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా పోతిరెడ్డిపాలెం రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. కారులోని ఐదుగురు విద్యార్థులు మరణించగా ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య(50) దుర్మరణం చెందాడు.