Intermediate Board | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : హాల్టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ అంశంపై వివిధ మీడియా ఛానళ్లలో వచ్చిన వార్తలకు గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. సాధారణ విద్యార్థులు 4,40,931 మంది, వృత్తి విద్యా విద్యార్థులు 50,056 మందికి గురువారం పర్యావరణ విద్యా పరీక్ష రాయడానికి అనుమతించినట్టు వెల్లడించింది. ఇందులో 128 మంది విద్యార్థులు ఈ నెల 29 రాత్రి పరీక్ష ఫీజు చెల్లించడానికి అనుమతి పొందారని పేర్కొన్నది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, కాలేజ్ మేనేజ్మెంట్లు, తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని వారికి హాల్టికెట్ లేకుండా పరీక్ష రాయడానికి అనుమతించినట్టు తెలిపింది.