హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి, పద్మభూషణ్ రామ్వంజీ సుతార్ మరణంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మరణం శిల్పకళారంగానికి తీరని లోటని శుక్రవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు. ప్రముఖుల విగ్రహాలకు రూపమిచ్చి ప్రపంచస్థాయిలో గుర్తింపు దక్కించుకున్న గొప్ప వ్యక్తి రామ్సుతార్ అని కొనియాడారు. శిల్పకళలో కోహినూర్ వజ్రంగా పేరుగాంచిన రామ్వంజీ కళాసేవలను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా రాజ్యాంగ నిర్మాత మహోన్నతరూపాన్ని అత్యంత సుందర మనోహరంగా తీర్చిదిద్దిన రామ్సుతార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించి దివంగతులైన ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.