హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. నడిరోడ్డుపైనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వారిని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. కుటుం బ భారం మోయలేకపోతున్నారు. ఇలా అప్పుల అగాధంలోకి కూరుకుపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకునేవారే కరువయ్యారు. ఫలితంగా ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో 125 మంది ఆటో డ్రైవర్లు తనువు చాలించారు. అయినా ప్రభుత్వంలో చలనం రావడంలేదు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుకు చొరవ తీసుకోవడమే లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఉచిత బస్సు ప్రయాణంతో కోట్లాది మంది మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. నాణేనికి మరోకోణం చూడటం మర్చిపోయింది. ఆ పథకం తొలినాళ్ల నుంచే లక్షలాది మంది ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయి. గిరాకీ కరువైంది. వాహనాల ఫైనాన్స్ చెల్లించలేని దుస్థితి. రోజు గడవడమే కష్టతరమైంది. కుటుంబ పోషణ భారమై ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో 500 మందికిపైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే, 125 మందికి పైగా ఆటో డ్రైవర్లు తనువు చాలించారు. ఏడాదికి జీవన భృతి కింద రూ.12 వేలు ఇస్తామని, ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలు ఏడాదిన్నర దాటినా కార్యరూపం దాల్చలేదు.
జీనవ భృతి ఇప్పిస్తామని, కార్పొరేషన్ పెట్టి ఆటో డ్రైవర్లను అందలం ఎక్కిస్తామని ఆశలు కల్పించిన ప్రభుత్వం.. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ఆటోడ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 125 మంది ఏడాదిన్నరలోనే చనిపోతే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటున్నారు. తమ తోటి డ్రైవర్లు ఆత్మహత్యల పాపం ఎవరిది? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఆటో డ్రైవర్లపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు? ఇంకా ఎందరు చనిపోవాలి? ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వానికి కనికరం కలుగుతుంది? అని నిలదీస్తున్నారు. ఈ ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలేనని తోటి కార్మికులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై ప్రభుత్వం సరైన ప్రకటన చేయకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలు ఎక్కే వారే కరువయ్యారని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. లక్షలు పెట్టి ఆటోలు కొనుక్కొని వాటి ద్వారానే కుటుంబాలను పోషించుకుంటూ, పిల్లలకు చదువులు చెప్పిస్తూ సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చిందని ఆందోళన చెందుతున్నారు. అప్పులు భారమై.. నడిరోడ్డుపై చెట్లకు ఉరేసుకున్నవారు కొందరైతే.. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నవారు ఇంకొందరు. రాత్రి ఆటోతో ఇంటికొచ్చిన తర్వాత.. ఖర్చులకు డబ్బులు సరిపోవని తెలిసి.. అనుభవించే ఆ మానసిక వ్యథ భరించరానిదిగా ఉంటుందని పలువురు అంటున్నారు. ఆ మనోవేదనను తట్టుకోలేక ఆర్ధరాత్రి వేళ పిల్లలు పడుకున్న తర్వాత కొందరు ఉసురు తీసుకుంటున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 31.01.2025 నాటికి తెలంగాణలో 5,10,265 ఆటోలు రన్నింగ్లో ఉన్నాయి. వాటికి డ్రైవర్లు సైతం అంతేమంది ఉన్నారని ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. అయితే, అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు ఏడున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నట్టు ఆటో డ్రైవర్ యూనియన్ నేతలు తేల్చి చెప్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేలు ఎటూ సరిపోవని, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం కనీసం రూ.20 వేల జీవన భృతి ఇవ్వాలని నాటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇస్తామన్న రూ.12 వేలనూ నేటికీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5,10,265 ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.612,31,80,000 ఇవ్వాల్సి ఉన్నది. ఇవి 17 నెలలకు కలిపితే మొత్తం సుమారు రూ.1,000 కోట్ల వరకు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు బాకీ పడింది.