హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఊపందుకోవాల్సిన సమయంలో పరిపాలనలోని లోటుపాట్లు ప్రతిబంధకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్లు లేక ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మున్సిపల్ శాఖలో 121 మందికి 45 రోజుల క్రితమే ప్రమోషన్లు కల్పించినా నేటికీ పోస్టింగులు ఇవ్వకపోవడంతో సిబ్బంది కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించడం పెను సవాల్‌గా మారింది. సుస్థిర పట్టణాభివృద్ధి సాధనే లక్ష్యంగా వంద రోజుల ప్రణాళిక అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
‘ఒక చర్య- ఒక మార్పు’ అనే నినాదం, ‘ప్రజలే ముందు’ అనే విధానం, పరిశుభ్రత ఆరోగ్యమే లక్ష్యంగా ఈ నెల 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 51 అంశాలతో యాక్షన్ ప్లాన్ అమలుచేయనున్నారు. ఎటువంటి విపత్తునైనా ఎదురొనే సామర్థ్యం గల పట్టణాలను రూపొందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి తెలిపారు.
వంద రోజుల ప్రణాళికలో భాగంగా ము రుగు కాలువలు, నాలాలు, ఓపెన్, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు, ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీలను శుభ్రం చేయడంతోపాటు మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణతోపాటు ప్రజారోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. దివ్యాంగులకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. వన మహోత్సవంలో మొక్కలు నాటనున్నారు. నల్లా కనెక్షన్లు ఆన్లైన్లో నమోదుచేయడం, కొత్త కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్ను, ఆస్తి పన్ను.. ఇలా 51 అంశాలను ఈ ప్రణాళికలో చేర్చారు.
కానీ, సిబ్బంది కొరత లక్ష్య సాధనకు ఆటంకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలో 121 మందికి ప్రమోషన్లు కల్పించింది. ఇందులో గ్రేడ్-3లో 56 మంది, గ్రేడ్-2లో 42 మంది, గ్రేడ్-1లో 12 మంది, సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా 11 మంది ఉన్నారు. 45 రోజుల క్రితమే వీరికి ప్రమోషన్లు ఇచ్చినా, ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వలేదు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ శానిటేషన్ వంటి కీలక విధులు సమర్థంగా నిర్వహించడం కష్టసాధ్యంగా మారుతున్నది. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమా దం పొంచిఉన్నది. శానిటేషన్ ప్రక్రియ సమర్థంగా సాగాలంటే పదోన్నతులు లభించిన వారి సేవలను త్వరితగతిన వినియోగించుకోవాల్సి ఉన్నది.