
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలోని కల్వకోలుకు పన్నెండు వందల ఏండ్ల చరిత్ర ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇక్కడి అరుదైన శిల్పాల గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా ప్రదర్శన ఏర్పాటు చేయాలని స్థానికులను కోరారు. ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కల్వకోలులోని కోటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. క్రీస్తుశకం 8వ శతాబ్దానికి చెందిన బల్లాల రాజు చంద్రదేవుని శాసనం, 13వ శతాబ్ది మహారాజు చంద్రదేవుని, చెరుకు పుల్లయ్యరెడ్డి శాసనాలు, 10 నుంచి 13వ శతాబ్దుల మధ్యకాలం నాటి నాగదేవతలు, చెన్నకేశవ, భైరవ, భద్రకాళి, వీరభద్ర, నందులు, వీరశిలలను పరిశీలించారు. ఈ ప్రాంతం అసలు పేరు కలువకొలను అని, కాకతీయ సామంత రాజధానిగా విలసిల్లిందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా జడ్జి జంగా జీవన్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.