Jairam Ramesh : ఎన్డీయే (NDA) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ పన్నెండేళ్లు ప్రభుత్వానికి ప్రధాని మోదీ (PM Modi) యే నేతృత్వం వహించారు. దాంతో దేశంలో వరుసగా పన్నెండేళ్లు ప్రధానిగా కొనసాగిన ఏకైక నేతగా ఆయన రికార్డు సృష్టించారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఆయన అదిగమించారు. అయితే దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని దాటారేమోగానీ, దేశానికి పెద్ద సమస్యగా పరిణమించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) విమర్శించారు.
ప్రధాని మోదీ దేశంలో ప్రభుత్వానికి కాకుండా ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్నారని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. 1947 ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన మంత్రివర్గానికి అధ్యక్షత వహించి భారత ప్రధాని అయ్యారని జైరామ్ రమేశ్ చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన ఆ మంత్రివర్గం పాలనలో ఐదేళ్లలోనే ఆధునిక భారతం ఆవిర్భవించిందన్నారు. 560కి పైగా రాచరిక రాష్ట్రాలను శాంతియుతంగా భారత యూనియన్లో విలీనం చేశారని, భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని అన్నారు. దేశంలోని జమీందారీ వ్యవస్థ రద్దు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్ట్లు వంటి నిర్ణయాలతో దేశం ప్రపంచ వ్యవహారాల్లో ఒక శక్తిగా ఆవిర్భవించిందని తెలిపారు.
1947 నుంచి 52 మధ్య నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం నెలకొల్పిన రికార్డులను మోదీ చరిత్ర నుంచి చెరిపేయాలని చూస్తున్నారని జైరామ్ రమేశ్ ఆరోపించారు. 1952, 1957, 1962 ఎన్నికల్లో నెహ్రూ భారీ మెజారిటీతో విజయం సాధించగా.. 2024లో మోదీకి కనీస మెజారిటీ కూడా రాలేదని ఎద్దేవాచేశారు. ప్రధాని కావడానికి ఎన్డీఏ నేతలకు తాయిళాలు ఇచ్చి మద్దతు కూడగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మోదీ పరిపాలనలో స్వతంత్ర ఎన్నికల సంఘం, పవిత్రమైన ఓటర్ల జాబితా వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ముప్పులో పడ్డాయన్నారు. పేపర్ లీక్ల కుంభకోణాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ప్రైవేటీకరణ పేరుతో ఎన్నో ప్రభుత్వ ఆస్తులను కొందరు ధనవంతుల పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఇతర వెనుకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్లను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.