Cumin Water | పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్య. దీన్ని తగ్గించుకోవడానికి ప్రజలు తరచూ సహజమైన ఇంటి చిట్కాలవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే జీలకర్ర నీరు, మెంతుల నీరు వంటి సంప్రదాయ పానీయాలు బరువు నియంత్రణలో సహాయపడతాయని విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవి నేరుగా కొవ్వును కరిగించకపోయినా, శరీరంలోని కొన్ని జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా పొట్ట కొవ్వు తగ్గుదలకు పరోక్షంగా దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీటిని సాధారణంగా జీలకర్ర గింజలను రాత్రంతా నానబెట్టి లేదా నీటిలో మరిగించి తయారు చేస్తారు. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపతాయి. కడుపులో ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. అలాగే జీవక్రియల వేగాన్ని పెంచి శరీరంలో కొవ్వు నిల్వ అయ్యే విధానాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో పొట్ట ఉబ్బినట్లుగా కనిపించే పరిస్థితి తగ్గి శరీరం తేలికగా అనిపిస్తుంది.
మెంతుల నీటిని తయారు చేయడానికి మెంతుల గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగుతారు. కొంతమంది నానిన గింజలను కూడా నమిలి తింటారు. మెంతుల్లో ఉండే ద్రావణీయ ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో అధికంగా తినే అలవాటు తగ్గి, రోజువారీ క్యాలరీల వినియోగం నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ఇది తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మెంతుల నీరు బరువు నియంత్రణకు ఉపయోగకరంగా ఉంటుంది. జీలకర్ర నీరు, మెంతుల నీరు రెండింటినీ పోల్చి చూస్తే, జీలకర్ర నీరు జీర్ణక్రియ, ఉబ్బరం తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది. మరోవైపు మెంతుల నీరు ఆకలి నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిల సమతుల్యత వంటి అంశాల్లో మెరుగైన ప్రభావాన్ని చూపుతుంది.
ఈ రెండు పానీయాల్లో ఏదీ నేరుగా పొట్ట కొవ్వును కరిగించే అద్భుత ఔషధం కాదు. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా కొవ్వు తగ్గుదల ప్రక్రియకు తోడ్పడతాయి. ఈ పానీయాలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం సాధారణంగా మంచిదిగా భావిస్తారు. జీలకర్ర గింజలను ముందురోజే నీటిలో నానబెట్టడం లేదా మరిగించి చల్లార్చి ఉంచడం ద్వారా జీలకర్ర నీటిని సిద్ధం చేసుకోవచ్చు. మెంతుల నీటిని తయారు చేయడానికి రాత్రంతా గింజలను నానబెట్టాలి. మెరుగైన ఫలితాల కోసం నీటితోపాటు నానిన గింజలను కూడా తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సహజమైన పానీయాలైనా ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా అనుకూలించవు. గర్భిణీలు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. జీర్ణాశయ సంబంధిత సున్నితత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు మెంతుల నీరు తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలి.
మెంతుల్లో ఉండే ద్రావణీయ ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదింపజేసి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీలకర్రలోని కొన్ని సహజ సమ్మేళనాలు జీర్ణక్రియను ప్రోత్సహించడంతోపాటు రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడే అవకాశం ఉంది. అయితే పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడంలో ఈ పానీయాల ప్రభావం వ్యక్తిగత జీవక్రియలు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ స్థాయి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల జీలకర్ర నీరు లేదా మెంతుల నీటిని మాత్రమే ఆధారంగా చేసుకుని బరువు తగ్గాలని ఆశించడం సరైంది కాదు. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో కలిపి వీటిని తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.