హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): హెర్బల్ కేర్ ప్రొడక్ట్స్‌పై పెట్టుబడి పెడితే తక్కువ ధరకు వస్తువులను పొందడంతోపాటు నెలవారీగా కొంత మొత్తాన్ని లాభంగా పొందవచ్చని నమ్మించిన ఓ కంపెనీ.. గొలుసు కట్టు (మల్టీ లెవల్ మార్కెటింగ్) విధానంలో వందల మందిని సభ్యులుగా చేర్చుకొని రూ.120 కోట్లకు మోసగించింది. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసు లు.. ఢిలీకి చెందిన ఆ కంపెనీపై దర్యాప్తు చేపట్టారు. బాధితుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని మధు విహార్ కేంద్రంగా పనిచేస్తున్న పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటె డ్, పీఎస్సీ హస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు 2021లో హైదరాబాద్‌లోని ఖాన్ లతీఫ్‌ఖాన్ బిల్డింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాయి. తమ వద్ద రూ.9,999 డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.880 చొప్పు 36 నెలలపాటు చెల్లిస్తామని ప్రచారం చేసి, భారీగా సభ్యులను చేర్చుకున్నాయి. మొదట్లో చేరిన వారికి చెప్పినట్టే కొన్ని నెలలపాటు రూ.880 చొప్పున చెల్లించాయి. దీంతో అప్పటికే సభ్యులుగా చేరినవారితోపాటు ఇతరులు సైతం పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశారు. అనంతరం ఆ సంస్థ నిరుడు నవంబర్ నుంచి సభ్యులకు డబ్బులు ఇవ్వడం మానేసి, ఆకస్మాత్తుగా బిచాణా ఎత్తేసిం ది. దీంతో బాధితుల్లో కొందరు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ నిర్వాహకుడైన రిజాజుద్దీన్ను ప్రశ్నించడంతో సమస్యను పరిష్కరిస్తామంటూ నమ్మించారు. దాంతో డబ్బుల కోసం ఈ ఏడాది ఏప్రిల్ వరకు బాధితులు ఎదురు చూశారు. మే నెలలో మరోసారి ఢిల్లీకి వెళ్లడంతో రిజాయుద్దీన్ అతడి సోదరులు వశీం, అజహర్, అఖిల్ ఫిరోజ్, షా తదితరులు దాడిచేసి బెదిరించారు.