Telangana | పాముకాటుకు పన్నేండ్ల బాలిక బలైంది. ఫ్రిజ్‌లో వాటర్ బాటిల్ తీసుకుంటున్న సమయంలో పాము కాటేసినా.. ఎలుక కొరికిందేమోనని చేసిన నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీసుకుంది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన నిట్టూరు లతకు కూతురు వైష్ణవి (12), కొడుకు సాకేత్ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం లత భర్త సంతోష్ మరణించడంతో పెద్దపల్లి పట్టణంలో సాగర్ రోడ్డులోని తన పుట్టింటిలోనే ఉంటున్నది. అక్కడే పనిచేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నది. కాగా, శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైష్ణవి తన ఇంట్లోని ఫ్రిజ్‌లో వాటర్ బాటిల్ తీసుకుంటున్న సమయంలో కాలిపై ఓ పాము కాటువేసింది. అయితే ఎలుక కొరికిందేమో అనుకుని బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే వైష్ణవి అపస్మారక స్థితిలోకి వెళ్లడం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పాముకాటుతో మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.