Telangana | బయ్యారం: ఏం అవసరమొచ్చిందో ఏమో.. ఏకంగా బ్యాంకుకే కన్నం వేయాలని అనుకున్నాడో ఓ బుడ్డోడు! ఆలోచన వచ్చిందే తడవుగా ఓ గడ్డపార అందుకొని దగ్గరలోని బ్యాంకుకు వెళ్లాడు. తాళాలు పగులగొట్టి బ్యాంకు లోపలికి కూడా ప్రవేశించాడు. కానీ అప్పుడే అసలు సమస్య వచ్చింది. బ్యాంకులో డబ్బులు ఉంటాయని తెలుసు.. కానీ ఎక్కడ దాస్తారో ఏడో తరగతి చదువుతున్న ఆ పిల్లాడి బుర్రకు తెలియదు కదా! డబ్బుల కోసం బ్యాంకులో అటు ఇటు తిరిగి ఎక్కడా కనిపించకపోవడంతో తీరిగ్గా ఇంటికి వెళ్లిపోయాడు. పొద్దున్నే బ్యాంకు తలుపులు తీసి ఉండటంతో కంగారుపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి.
బయ్యారంలోని ఎస్బీఐ ఆవరణను శుభ్రం చేసేందుకు గురువారం తెల్లవారుజామున వచ్చిన ఓ మహిళ బ్యాంక్ తాళాలు పగులగొట్టి ఉండటం గమనించింది. వెంటనే బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి బ్యాంక్ వద్దకు వెళ్లి పరిశీలించారు. బ్యాంకులో నుంచి ఎలాంటి నగదు, ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించారు. మరి ఎందుకు బ్యాంక్ లోపలికి ప్రవేశించి ఉంటారని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో బ్యాంకులో వేలిముద్రలు సేకరించారు. అలాగే బ్యాంక్ ఆవరణలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ టీవీ ఫుటేజిలు చేసిన పోలీసులు, బ్యాంక్ సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఎందుకంటే బ్యాంక్‌లో చోరీకి యత్నించింది ఏడో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు. గడ్డపారతో బ్యాంక్‌కు వచ్చిన అతను ముందు గేటు తాళాలు పగులగొట్టాడు. ఆ తర్వాత బ్యాంక్ డోర్ కూడా పగులగొట్టి దర్జాగా బ్యాంక్ లోపలికి వెళ్లాడు. బ్యాంక్ లోపలికి అయితే వెళ్లాడు కానీ ఆ పిల్లాడికి ఎక్కడ డబ్బులు కనబడలేదు. ఎక్కడైనా ఒక్క రూపాయి దొరక్కపోతుందా అని బ్యాంక్ అంతా తిరిగాడు. ఇక లాభం లేదనుకుని నిరాశగా ఇంటికి వెళ్లిపోయాడు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు చూసి పోలీసులు, బ్యాంక్ సిబ్బంది షాకయ్యారు. ఆ తర్వాత ఆ బాలుడు ఎవరో కనుక్కునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు బ్యాంక్ సమీపంలో ఉంటున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ కొడుకుగా గుర్తించారు. అతని దగ్గరికి వెళ్లి విచారించగా.. బ్యాంక్ చోరీకి యత్నించింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో ఆ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.