గద్వాల: ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా గద్వాల (Gadwal) ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తినడంతో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మెనూ సక్రమంగా లేదని అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఉదయం ఉప్మా వండిన తర్వాత దాంట్లో పురుగులు ఉన్నాయని హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని, దీంతో దానిని పారబోశారని చెప్పారు. అంతకుముందు దానిని తిన్న వారు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉన్నారు.