చిక్కడపల్లి, సెప్టెంబర్ 22: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని దామగుండం అడవిని పరిరక్షించుకుందామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆ అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పేరుతో 12 లక్షల చెట్ల నరికివేత నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సేవ్ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, పౌరసంఘాల, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, ఉద్యోగ, న్యాయ, కార్మిక, సామాజిక మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ హైడ్రా పేరుతో చెరువులను కుంటాలను కాపాడుతున్నామని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తన సొంత జిల్లాలోనే ఇంత విధ్వంసం జరుగుతుంటే పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. దామగుండం అడవిని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కోరారు. పర్యావరణాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయకపోతే వయనాడ్, ఉత్తరాఖండ్ వంటి ప్రకృతి విలయాలు చూడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ ప్రొపెసర్ నాగేశ్వర్ హెచ్చరించారు.
ఈ ప్రాజెక్టుకి సంబంధించి పర్యావరణ నష్టం రిపోర్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మొట్టమొదట 12 లక్షల మొక్కలు నాటి అది అడవైన తర్వాతే నేవీ రాడార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని సూచించారు. అడవినే ఒక ఆస్తిగా చూడాలని ప్రముఖ పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ కోరారు. 1956లో తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం కలిసిన తర్వాతే ప్రకృతి విధ్వంసం మొదలైందని, ఇది భవిష్యత్తు తరాల సమస్య అని చెప్పారు. హైదరాబాద్ వాసులు మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితులను రానీయొద్దని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు.
తెలంగాణ ఊటీ అయిన దామగుండాన్ని కాపాడుకుందామని, దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ పరిగి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, ఆనంద్ తెలిపారు. రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం 2018లో కేంద్ర ముందుకొస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిందని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే దాని ఏర్పాటుకు సంతకం పెట్టిందని విమర్శించారు.
ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. 12 లక్షల చెట్లను నరకడం దుర్మార్గమని, అడివిని రక్షించే దిశగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇక్కడితో అపపకుండా ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని దామగుండం జేఏసీ ఈ సందర్భంగా తీర్మానించింది. కార్యక్రమంలో దామగుండం జేఏసీ కోఆర్డినేటర్లు రామన్న మాదిగ, జర్నలిస్టులు తులసీ చందు, గీత, సిరాజ్, దామగుండం రామలింగేశ్వర ఆలయ పూజారి సత్యానంద స్వామి, సంద్య, విమలక్క, దామగుండం మాజీ సర్పంచ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.