హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంసర్త, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దళిత సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు గొప్పవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. బాబూ జగ్జీవన్‌రామ్ 116వ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితోపాటు, పలు మంత్రిత్వశాఖలు చేపట్టి అన్ని రంగాల్లో తనదైన పాత్రను పోషించి దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారని కొనియాడారు. దళితులు, బీసీలు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం, వారి హకుల సాధన కోసం నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారని తెలిపారు. కార్మికశాఖ మంత్రిగా కార్మిక సంక్షేమ విధానాలకు బాటలు వేశారని కీర్తించారు. జీవిత పర్యంతం పేదలు, పీడితవర్గాల సంక్షేమం, హకుల సాధన కోసం పనిచేసిన బాబూ జగజ్జీవన్‌రామ్ ప్రజలు ప్రేమగా పిలుచుకునే ‘బాబూజీ’గా ప్రఖ్యాతులయ్యారని సీఎం తెలిపారు.
బాబూజీ స్ఫూర్తితో సంక్షేమ తెలంగాణ
బాబూజీ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నదని స్పష్టం చేశారు. దళితబంధుతోపాటు పలు పథకాలను అమలు చేస్తూ, సామాజికంగా ఆర్థికంగా వివక్షకు గురైన దళితుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలిపారు.