హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): మనుషుల్లో ఆవేశం, ఆక్రోశాలు పెరిగిపోతున్నాయి. చిన్నపాటి గొడవలకే ఓపిక నశించిపోతున్నది. కొద్దిపాటి గొడవలకే 2025లో నమోదైన హత్యలే 112 ఉన్నాయి. 2024లో ఈ తరహా హత్యలు 82 నమోదు కాగా.. 2025లో ఆ సంఖ్య 112కు పెరిగింది. ముఖ్యంగా కుటుంబాల మధ్య వచ్చే విభేదాలు కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం లేదు. కుటుంబ వివాదాల కారణంగా 2025లో 212 హత్యలు నమోదయ్యాయి. 2024లో ఇవి 229గా నమోదయ్యాయి. సెక్సువల్ జెలసీ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దంపతుల మధ్య వస్తున్న పొరపొచ్చాలే ఇందుకు కారణమని పోలీసులు చెప్తున్నారు. అనుమానంతో నిర్దాక్షిణ్యంగా భాగస్వామిని హతమార్చుతున్నారు. ఈ తరహా కేసులు 2024లో 102 నమోదు కాగా.. 2025లో వాటి సంఖ్య 100గా నమోదైంది.