రంగారెడ్డి, జనవరి 22 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల అవసరాల పేరుతో ప్రభుత్వం ఆలయ భూములనూ వదలడంలేదు. ఫ్యూచర్‌సిటీలో భాగమైన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోగల ఓంకారేశ్వరస్వామి ఆలయ భూమిని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఆలయ భూములు సాగుచేసుకుంటున్న రైతులు కోర్టును ఆశ్రయించారు. కౌలు రైతులకు కోర్టుకు వెళ్లే హక్కులేదని, ఈ భూములకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ టీజీఐఐసీ ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. నందివనపర్తిలో సర్వే నంబర్ 148 నుంచి 267 వరకు ఓంకారేశ్వరస్వామి దేవాలయానికి 1,450 ఎకరాల భూమి ఉన్నది.
ఈ భూమి నందివనపర్తితోపాటు పక్కనే ఉన్న నజ్దిక్‌సింగారంలో కూడా ఉన్నది. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.1,500 కోట్లు ఉంటుంది. ఈ భూమిని రెండు గ్రామాలకు సంబంధించిన 500 మందికిపైగా రైతు లు కౌలుకు సాగుచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆలయానికి కౌలు చెల్లిస్తున్నారు. నందివనపర్తి ఓంకారేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన 1,450 ఎకరాల నుంచి 1,100 ఎకరాలను పరిశ్రమల అవసరాల కోసం తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములపై కౌలు రైతులకు ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ యాభైశాతం పరిహారం ఇవ్వాలని భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. నందివనపర్తి, నజ్దిక్‌సింగారం గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీలోకి తీసుకున్నది. ఈ రెండు గ్రామాల్లో ఉన్న ఓంకారేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన 1,100 ఎకరాలను సేకరించడానికి సిద్ధమైంది.
ఇందుకు సంబంధించి భూసేకరణకు మరో రెండురోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ భూముల విలువ రూ. 1,000 కోట్ల వరకు ఉన్నది. ఈ గ్రామాలు రెండు ఫ్యూచర్‌సిటీలో ఉన్నందున ఈ భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్లో ఈ భూములకు ఎకరానికి రూ. కోటి పైనే ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. యాచారం మండలంలో ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రభుత్వం పరిశ్రమల పేరుతో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీచేసింది. మొండిగౌరెల్లిలో 700 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేసింది. కొత్తపల్లిలో మరో 1,000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే నందివనపర్తి ఓంకారేశ్వర ఆలయ భూములను తీసుకోవాలని భావించింది.
నందివనపర్తి, నజ్దిక్‌సింగారం గ్రామాలకు సంబంధించిన 500 మందికి పైగా రైతులు ఓంకారేశ్వరస్వామి ఆలయ భూములను కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఈ భూముల్లో వరి, కూరగాయల పంటలతో పాటు అనేకమంది డెయిరీ, కోళ్లఫారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నట్టుండి ప్రభుత్వం ఈ భూములను తీసుకోవడానికి నిర్ణయించడంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు వాపోతున్నారు. ఈ భూముల్లో 50 సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్నామని, ప్రభుత్వం భూములను తీసుకుంటే తాము రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.