భూమినే నమ్ముకొని బతుకుతున్న లగచర్ల గిరిజన రైతుల గుండెల్లో మళ్లీ దడ మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు పేరిట 110 ఎకరాల భూ సేకరణ కోసం దాదాపు 400 మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. ఖాకీల పదఘట్టనల నడుమ అధికారులు శుక్రవారం డిజిటల్ సర్వే మొదలుపెట్టగా చావనైనా చస్తాంగాని భూములను మాత్రం ఇచ్చేది లేదని రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.
కొడంగల్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఏడాది కాలంగా సర్కారు వేధింపులను భరిస్తూ.. పోలీసుల దౌర్జన్యం, కేసులు, జైలు జీవితంతో విసిగిపోతున్న లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో మళ్లీ ఖాకీలు మోహరించారు. ‘ప్రాణాలు పోయినా సరే.. భూములిచ్చేది లేదు’ అని స్థానిక గిరిజన రైతులు తెగేసి చెప్తున్నా రేవంత్ సర్కారు మాత్రం కనికరించడం లేదు. నిన్నటిదాకా ఫార్మా అని చెప్పి, ఇప్పుడు పారిశ్రామికవాడ అని కొత్త రాగంతో కాంగ్రెస్ సర్కార్ భూసేకరణకు కాలు దువ్వుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం వందలాది మంది పోలీసు బలగాలతో లగచర్లకు వెళ్లిన రెవెన్యూ అధికారులు సర్వే మొదలుపెట్టారు. కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారంటూ సర్వే మొదలుపెట్టిన అధికారులు, తాము భూములు ఇచ్చేది లేదని చెప్పిన గిరిజన రైతుల పొలాల్లోకి వెళ్లి హద్దులు నిర్ధారించుకొని సర్వే చేశారు. ఈ క్రమంలో గిరిజన రైతులు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ సర్వేను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘అంగీకరించిన వారి భూములు తీసుకోండి తప్ప తాతల కాలం నుంచి నమ్ముకున్న మా భూముల జోలికి మాత్రం రావద్దు’ అని తెగేసిచెప్పారు.
బలగాలతో భూమి మీదికి..
ఏడాది నుంచి ఫార్మా కంపెనీలకు భూములిచ్చేది లేదని ప్రభుత్వంతో పోరాడుతున్న లగచర్ల రైతులు పోలీసు కేసులు, జైలు అంటూ నిన్నటిదాకా ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడైనా కంటినిండా నిద్రపోదామనుకున్న సమయంలో శుక్రవారం ఒక్కసారిగా పోలీసు బలగాలతో అధికార యంత్రాంగం భూముల మీదికి వచ్చింది. ఉదయం 9.30 గంటలకు దుద్యాల మండల తహసీల్దార్ కిషన్‌తో పాటు పలువురు సర్వే అధికారులు పారిశ్రామికవాడ పేరిట భూముల సర్వే కోసం వచ్చారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏకంగా 400 మందికిపైగా పోలీసు బలగాలు సర్వే బృందంతో కలిసి వచ్చాయి. లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో 110 ఎకరాల భూముల సేకరణకు అధికారులు నిర్ణయించినందున ఆ మేరకు డిజిటల్ సర్వే నిర్వహించారు. మూడు బృందాలుగా విడిపోయిన సర్వే అధికారులు తొలుత లగచర్లలో సర్వే చేపట్టారు. అక్కడ కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారని అధికారులు చెప్పారు. ఆ మేరకు రైతులు కూడా వచ్చి తమ భూముల హద్దులు సూచించడంతో అధికారులు సర్వే పూర్తి చేశారు. మరో రెండు బృందాలు రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలకు వెళ్లాయి. అయితే అక్కడ అప్పటికే గిరిజన రైతులు ప్లకార్డులతో సర్వేను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ భూములు ఇచ్చేదిలేదని, ఎవరైనా ఇస్తే వారి భూమిని తీసుకోండి గాని తమ భూముల జోలికి రావద్దని అధికారులను కోరారు. అయినా పోలీసు పహారా మధ్య అధికారులు సర్వేనంబర్లు 102, 117,120, 121లోని 110 ఎకరాల్లో సర్వే చేశారు. రైతులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ‘మీరు అంగీకరించిన తర్వాతే భూములు తీసుకుంటాం’ అని మభ్యపెట్టి సర్వే పూర్తి చేశారు. ‘ప్రాణాలైనా ఇస్తాం గాని మా భూములు మాత్రం ఇవ్వం’ అని సర్వే సమయంలో అధికారుల ముందు గిరిజన రైతులు నిరసన తెలిపారు.
దౌర్జన్యంగా లాక్కుంటరా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే తమకు భూమి కష్టాలు మొదలయ్యాయని, గత పాలకులు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి వ్యవసాయం చేసుకునేలా చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి గిరిజన రైతులపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు గుంటల నుంచి 6 గుంటల వరకు భూమి ఉన్న రైతులపై దౌర్జన్య చేసి భూములు లాక్కోవడం బాధాకరంగా ఉన్నదని వాపోయారు. ఏండ్ల కాలం నుంచి అవే భూములను నమ్ముకొని, ముంబై వంటి నగరాలకు వెళ్లి కూలి పనులు చేసుకొని వచ్చిన డబ్బుతో భూములను చదును చేసుకొని పంటలు పండించుకొని బతుకుతున్నట్టు తెలిపారు. ఎంతో కష్టపడి పంటలు పండే భూములుగా తీర్చిదిద్దుకొని ఇప్పు డు ప్రభుత్వానికి అప్పగించాలంటే ఎలా అని గిరిజన రైతులు ప్రశ్నింస్తున్నారు. సమ్మతి తెలిపిన రైతుల పొలాలను తీసుకొని తమ లాంటి రైతులను వదిలేయాలని వేడుకొంటున్నారు. భూమి కోసం కష్టాలు పడ్డామని, చివరికి కేసులతో జైలు పాలయ్యామని ఇప్పటికైనా సీఎం తమపై జాలి చూపాలని కోరుతున్నారు. పరిశ్రమలు పెట్టాలంటే తమ భూములే కావాలా? అని నిలదీస్తున్నారు. ‘ఎంత వరకైనా పోతం.. భూములు ఇవ్వం’ అని స్పష్టంచేస్తున్నారు.
అసైన్డ్ భూములే అధికం
ఇండస్టియ్రల్ కారిడార్ కోసం ప్రభుత్వం సేకరిస్తామంటున్న 1250 ఎకరాల్లో నిరుపేద రైతులకు చెందిన అసైన్డ్ భూములే అధికంగా ఉన్నాయి. హకీంపేట గ్రామంలో 350 ఎకరాల అసైన్డ్, 146 ఎకరాల పట్టా భూమి ఉన్నది. లగచర్లలో 110 ఎకరాల అసైన్డ్, 497 పట్టా భూమి, పోలెపల్లిలో 73.29 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది. వాస్తవానికి ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉండటంతో పాటు పచ్చని పంటలు పండుతాయి. ఈ నేపథ్యంలో భూములు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులకు నష్ట పరిహారం కింద రూ.20 లక్షల చెక్కులను అందించినట్టు అధికారులు తెలిపారు.
మమ్ముల వదిలెయ్యిండ్రి
సీఎం సారూ మా భూములు గుంజుకోడానికా నీకు ఓట్లేసి గెలిపించుకున్నది. ముసలోళ్లమైనం. ఎప్పుడూ ఇట్ల బాధలు పడలే. ఏడాది నుంచి భయంభయంగ బతుకుతున్నం. కేసులతో మా పిల్లలు జైలుకు పోయిండ్రు. ఇప్పటికైనా అయిపోయిందనుకుంటే మళ్లీ సర్వే అని సార్లు పోలీసులతోటి వచ్చిండ్రు. భూముల కాడికి ఎప్పుడెవలు వస్తరో ఏం చేస్తరోనని తిండి తినక.. కంటికి నిద్ర లేకుండ బిక్కుబిక్కుమనుకుంట బతుకుతున్నం. మమ్ముల వదిలెయ్యిండ్రి..మీకు పుణ్యముంటది.
– బాల్కిబాయి, భూ బాదితురాలు, రోటిబండతాండ
భూములు పోతే చావే గతి
మా భూముల జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటం. మాకు తిండిపెట్టే భూములు పో తే ఎట్ల బతకాలె? మా భూములను కాపాడాలని కనిపించిన అధికారినల్లా వేడుకొంటు న్నం. భూముల గోడవల్లోనే కేసులై ఎంతో మంది మా పోరగాండ్లు జైలు పాలైండ్రు. అప్ప ట్లో కేసుల భయంతోని చెట్టూపుట్టల్ల దాక్కు న్నం. బెయిల్ దొరికి మావోళ్లు ఇండ్లకచ్చినంక ఇప్పట్ల పూర్తి అయ్యిందనుకున్నం. మళ్లీ సీఎం మా మీదికి బాంబులు పేలుస్తుండు.ఇదేమన్న న్యాయమేనా సీఎం సారూ? మా మీద దయ ఉంచి భూముల జోలికి రాకుండ్రి. మా మానానా మమ్ముల బతకనియ్యుండ్రి.
– పాండునాయక్, రోటిబండతాండ