ముంబై/పెద్దపల్లి, జనవరి 1 (నమస్తే తెలంగాణ)/గడ్చిరోలి: మావోయిస్టు పార్టీలో మరో సంచలనాత్మక లొంగుబాటు నమోదైంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు భార్య తారక్క లొంగిపోయారు. ఆమెతోపాటు మరో పది మంది మావోయిస్టులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బుధవారం గడ్చిరోలిలో లొంగిపోవడం సంచలనం సృష్టించింది. వీరిలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన సిడాం విమలచంద్ర అలియాస్ తారక అలియాస్ వత్సల 1986 నుంచి నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఆమె భర్త మల్లోజుల వేణు మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 38 ఏండ్లుగా విప్లవ సంస్థల్లో పనిచేస్తున్న తారక్క 35 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.
గడ్చిరోలి జిల్లా అహేరి మెంబర్‌గా, పెరిమెలి, భామ్రఘడ్ ఏరియా కమాండర్‌గా, ఏరియా కమిటీ సెక్రటరీగా, సౌత్ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన తారక్క ఇటీవల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టారు. దండకారణ్య వైద్య బృందానికి కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఆమెపై వివిధ పోలీస్స్టేషన్లలో దాదాపు 170 కేసులు, రూ.కోటికి పైగా రివార్డు ఉన్నట్టు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఆమె గడ్చిరోలి రీజియన్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస విధానాల్లో భాగంగా లొంగిపోయిన తారక్క రూ.15 లక్షలు, మిగిలిన వారు వారి తలలపై ఉన్న రివార్డుల మొత్తాన్ని బట్టి సహాయాన్ని అందుకుంటారు. నక్సల్స్ కార్యకలాపాలపై 2022 నుంచి ప్రభుత్వం కఠిన చర్యలు అవలంబిస్తుండటంతో ఇప్పటివరకు 44 మంది కరడుగట్టిన మావోయిస్టులు లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. నక్సలిజం ముగింపు దశకు చేరకున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల ద్వారానే న్యాయం జరుగుతుందని మావోయిస్టులు భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. నెల క్రితం దండకారణ్యంలో పనిచేస్తున్న మరో ముఖ్యనేత పోలీసుల అదుపులో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. వేణుగోపాలరావు సోదరుడు కిషన్‌జీ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా వదంతులు వినిపించాయి. అయితే, ఇదంతా పోలీసుల ప్రచారమేనని మావోయిస్టు పార్టీ కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న వేణుగోపాలరావు భార్య లొంగిపోవడం సంచలనంగా మారింది.