Nagarkurnool | నాగర్కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంటకు చెందిన మండ్లి గురువమ్మ(29) అనే మహిళ గత పది రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి మహబూబ్ నగర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ కూడా పరిస్థితి చేయి దాటిపోవడంతో తీవ్ర అనారోగ్యంతో గురువమ్మ గురువారం సాయంత్రం మరణించింది.
కాగా మృతదేహాన్ని 108 అంబులెన్స్ లో తీసుకువచ్చిన సిబ్బంది ఫరహాబాద్ చౌరస్తా వద్ద అడవిలో సాయంత్రం 6 గంటలకు వదిలి వెళ్లారు. అక్కడి నుంచి తమ స్వగ్రామమైన ఈర్లపెంటకు మృతదేహాన్ని ఎలా తీసుకువెళ్లాలి అన్నది అర్థం కాక రాత్రి అంతా మృతదేహం వద్ద రోదిస్తూ ఉండిపోయారు.
ప్రభుత్వ వాహనమే కదా మా పెంటలో వదిలి పెట్టాలని వైద్య సిబ్బందిని వేడుకున్న పట్టించుకోకుండా అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెంచులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో మేము నిద్రలో ఉండగా మృతదేహాన్ని ఇలా అడవిలో వదిలి వెళ్ళడం ఏంటని చెంచులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ అధికారులకు శుక్రవారం ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో ఆటోలో మృతదేహాన్ని ఈర్లపెంటకు తీసుకెళ్లామని చెంచులు పేర్కొన్నారు.