బాన్సువాడ, ఆగస్టు 22: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 103 స్థానాల్లో విజయం సాధిస్తుందని, చాలా చోట్ల ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం లో బీజేపీ, కాంగ్రెస్‌కు క్యాడర్, లీడర్ లేరని పేర్కొన్నారు. బలమైన నాయకత్వం, బలమైన క్యాడర్ ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలించే రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు.
మహారాష్ట్ర ప్రజలు సైతం సీఎం కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కర్ణాటకలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు దక్కవని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ఆయనను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని, అన్ని వర్గాల మద్దతు సీఎంకు లభిస్తుందని అన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగానే 115 స్థానాలకు పేర్లు ప్రకటించడానికి దమ్ము, ధైర్యం కావాలని, ఇదంతా కేసీఆర్‌కు ప్రజలు ఇచ్చిందేనని పేర్కొన్నారు.