హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కందులకు బహిరంగ మార్కెట్లో రికార్డు ధర పలుకుతున్నది. ఎప్పుడూ లేనివిధంగా క్వింటా కందులు రూ.10 వేలకుపైగా ధర పలుకుతుండటం విశేషం. నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాల్‌కు రూ.10,120, తాండూరు రూ.10,012 ధర పలికింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో రాబోయే రోజుల్లో కందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది. ముందు జాగ్రత్తగా వ్యాపారులు అధిక ధర వెచ్చించి రైతుల నుంచి కందుల కొనుగోలుకు పోటీ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిల్వలు పెంచేందుకు నాఫెడ్ సంస్థతో దేశవ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందులు కొనాలని నిర్ణయించింది. తెలంగాణలో మార్క్‌ఫెడ్ ద్వారా 50 వేల టన్నుల సేకరణకు అనుమతి ఇచ్చింది. ఎప్పుడైనా నాఫెడ్, మార్క్‌ఫెడ్ మద్దతు ధరకు మాత్రమే పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తాయి. కానీ, తొలిసారి నాఫెడ్ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా వ్యాపారులతో పోటీపడుతూ మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తున్నది. మద్దతు ధర క్వింటాలుకు రూ.7 వేలు ఉండగా, నాఫెడ్ నిర్ణయించిన ధర ప్రకారం రూ.10 వేలకు మార్క్‌ఫెడ్ కందులను కొనుగోలు చేస్తున్నది. వానకాలం సీజన్లో రాష్ట్రంలో 4.74 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు కాగా, 2.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో భారీ ధర పలుకుతుండటంతో కంది రైతులకు గిట్టుబాటు అవుతున్నది. రాబోయే రోజుల్లో కందిపప్పు ధర కిలో రూ.200 పలుకవచ్చని అంచనా వేస్తున్నారు.