హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్స్ (ఎంపీడబ్ల్యు) సర్వీసులో ఉండగా చనిపోతే వారి కుటుంబీకులకు ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధిత గ్రామ పంచాయతీ చెల్లించాల్సి ఉంటుంది. ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు కార్మికులు ఎవరైనా సర్వీసులో ఉండగా చనిపోతే వారి దహన సంస్కారాలకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.5 వేల మొత్తాన్ని రూ.10 వేలకు పెంచారు. ఈ మొత్తాన్నీ సంబంధిత గ్రామ పంచాయతీ చెల్లించాలని ఆదేశించారు.