వనపర్తి, జూలై 20 (నమస్తే తెలంగాణ): దేశం లో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం 27 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ. 10,500 కోట్ల భారం భరిస్తూ ఉచిత కరెంటును అందిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ప్రాజెక్టులను నిర్మిస్తూ రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమికి సాగునీటిని అందించాలనే లక్ష్యం తో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. బుధవారం వనపర్తి జిల్లాలో నిరంజన్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వనపర్తి మం డలం అచ్యుతాపురంలో మీడియాతో మాట్లాడు తూ.. అన్ని రంగాల్లో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి మండలంలో అన్ని వర్గాల ప్రజల కోసం ఓ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులను ఇస్తామని తెలిపారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించామని తెలిపారు.