హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పది తరగతి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు రాష్ట్ర సగటుకంటే అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత శాతం 90 శాతం కాగా, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 98.14, బీసీ 97.53 శాతం, మైనార్టీ గురుకులాలు 94.1శాతం ఉత్తీర్ణత నమోదుచేయడం గురుకులాల పనితీరుకు నిదర్శనం. ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన గురుకులాలు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటడంపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 268 ఎస్సీ గురుకులాల నుంచి 18,545 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 98.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో 126 గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. రాష్ట్రంలోని 142 బీసీ గురుకులాల నుంచి 10,645 మంది పరీక్షలకు హాజరుకాగా 10,381 మంది (97.53) ఉత్తీర్ణత సాధించారు. 204 మైనార్టీ గురుకులాల నుంచి 11,329 మంది పరీక్షలకు హాజరు కాగా, అందులో 94.1 శాతం మంది పాసయ్యారు.
48 మైనార్టీ గురుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని 155 గిరిజన గురుకులాల నుంచి 6,557 మంది పరీక్షలకు హాజరుకాగా, 6287 మంది (96 శాతం) ఉత్తీర్ణులయ్యారు, 20 గిరిజన విద్యాలయ సంస్థలు 100శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకుల సొసైటీల కార్యదర్శి మల్లయ్య భట్టు, ఎస్సీ గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రోస్, అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.