హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): గురుకులాల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య కుటుంబ సంబంధాలు, ప్రేమానుబంధాలు దెబ్బతింటున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను పలువురు బీసీ నేతలతో కృష్ణయ్య కలిసి, వినతిపత్రం అందజేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు చాలా డిమాండ్ ఉన్నదని, వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకోవడానికి ముందుకొస్తున్నారని వివరించారు. మరో 100 బీసీ గురుకులాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెసిడెన్షియల్ పాఠశాల విధానం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాక ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీ హాస్టళ్లలో 55 శాతం విద్యార్థులు చదువుతున్నారని, మరి వాటిని కూడా మారుస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ గురుకులాల్లో మంచి విద్యా ప్రమాణాలున్నాయని, అందులో చదివిన వేలాది మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, స్థిరపడుతున్నారని, వారి కుటుంబాలు బాగుపడుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఏకపక్షంగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సెమీరెసిడెన్షియల్ మార్పు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రిని కలిసినవారిలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, నందగోపాల్, రఘుపతి, నిఖిల్, శ్రీనివాస్, పర్వతాలు తదితరులు ఉన్నారు.