NIMS | ఎనిమిది నెలల కాలంలోనే 100 కిడ్నీ మార్పిడీలు, 30 రోబోటిక్ సర్జరీలు పూర్తిచేసిన నిమ్స్ వైద్యబృందాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా అభినందించారు. నిరుపేదల ప్రాణాలు కాపాడడంలో తెలంగాణ సర్కార్‌కు ఉన్న కమిట్మెంట్కు ఇది నిదర్శనమని, ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఈ ఘనత సాధ్యమైందని ట్విట్టర్ ద్వారా మంత్రి చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అత్యంత అధునాతన వైద్యం అందించడంతోపాటు ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడంలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) తాజాగా మరో మైలురాయిని దాటింది. అతి తక్కువ వ్యవధిలో 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసిన ప్రభుత్వ వైద్యశాలగా రికార్డులకెక్కింది. దేశ చరిత్రలో ఇలా ప్రభుత్వ వైద్యరంగంలో ఒకే సెంటర్లో ఎనిమిది నెలల అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగడం ఇదే ప్రథమం అని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, యురాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. సగటున మూడు రోజులకో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు 99 ఆపరేషన్లు చేశామని, శుక్రవారం 100వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా పూర్తిచేశామని తెలిపారు. నిమ్స్‌లో ప్రారంభించిన రోబో సర్జరీలు 30కి చేరినట్టు డాక్టర్ బీరప్ప వెల్లడించారు. గతనెలలో ప్రారంభమైన రోబో సర్జరీలలో 16 యురాలజి విభాగానికి చెందినవి కాగా 12 సర్జికల్ గ్యాస్ట్రో, 2 సర్జికల్ అంకాలజి విభాగానికి చెందిన శస్త్రచికిత్సలు జరిగినట్టు వివరించారు.
నిమ్స్‌లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏటా సగటున 100 కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తవడం రికార్డు అని నిమ్స్ వైద్యులు తెలిపారు. దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన మౌలిక సదుపాయాలు కల్పించిందని యురాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుండటంతో నిమ్స్‌లోనే పెద్ద సంఖ్యలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు సాధ్యమవుతున్నాయని అన్నారు. 10 ప్రత్యేక సందర్భాల్లో ఒకే రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ చేశామని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ చేసిన 100 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 61 లైవ్ కేసులు కాగా, 39 కెడావర్ కేసులని చెప్పారు. లైవ్ కేసుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిమ్స్‌లో దాదాపు వెయ్యి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఎయిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు ప్రత్యేక విభాగం, వైద్య బృందం ఉంటుంది. కానీ నిమ్స్‌లో మాత్రం యురాలజీ విభాగంలోనే డ్నీ ఆపరేషన్లు చేస్తూనే మరో పక్క ఇతర వైద్యచికిత్సలను అందించామని చెప్పారు. ప్రతి నెల 800 నుంచి 900 వరకు యురాలజి ప్రొసీజర్స్‌ను జరుపుతున్నట్టు రాహుల్ దేవరాజ్ వివరించారు. నిమ్స్ యురాలజీ విభాగంలో డాక్టర్లు రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, చరణ్‌కుమార్, ధీరజ్, సునీల్, అరుణ్, విష్ణు, జానకి, హర్ష, పవన్, సూరజ్‌కుమార్, పూవరసన్, షారూఖ్, అనంత్, అభిషేక్, అనుపమ, రాకేశ్, మధుసూధన్తోపాటు అనస్తీషియా విభాగాధిపతి నిర్మల, ఇందిర, అన్నెకిరణ్, ప్రసాద్, షిబాని, నెఫ్రాలజి విభాగం నుంచి గంగాధర్, భూషణ్‌రాజు, స్వర్ణలత తదితరులు సహకారంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుపుతున్నామని తెలిపారు.
నిమ్స్‌లో 1989లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రారంభించారు. శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇక్కడ మొట్టమొదట కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిపారు. 2016 నాటికి నిమ్స్‌లో కిడ్నీ మార్పిడీ శస్త్రచికిత్సల సంఖ్య వెయ్యికి చేరుకోగా, 2023 సెప్టెంబర్ నాటికి 1600కు చేరుకున్నట్టు నిమ్స్ అధికారులు తెలిపారు.
ఒక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సకు కార్పొరేట్ దవాఖానలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, నిమ్స్‌లో పేదలకు ప్రభుత్వ సాయంతో పైసా ఖర్చు లేకుండానే చేస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ బీరప్ప చెప్పారు. ఈ లెక్కన గడిచిన 8 నెలల కాలంలో రూ.15 కోట్ల విలువైన చికిత్సను పేద రోగులకు పూర్తి ఉచితంగా అందచేసినట్టు వివరించారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులు తప్పనిసరిగా ఇమ్యూనోసప్రేషన్ మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులను రోగి జీవితకాలం వాడాలి. ఈ మందులు ఖరీదైనవి కావడంతో ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మందులను కూడా నిమ్స్‌లో కిడ్నీ మార్పిడీ చేయించుకున్న రోగులకు జీవితకాలం పాటు పూర్తి ఉచితంగా అందచేస్తున్నట్టు తెలిపారు.