హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): చిన్న కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లు చెల్లిస్తే సుమారు 2,200 బిల్లులు పేమెంట్ అవుతాయని, ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్లు, భవవనాల శాఖ, పంచాయతీరాజ్‌శాఖ నుంచే తమ బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
స్పెషల్ డెవలప్మెంట్ నిధులు (ఎస్డీఎఫ్) కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే రూ.3 వేల కోట్ల విలువైన పనులకు నిధులు ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రులను, సీఎస్‌ను తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇప్పటికే అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు.
‘చేసిన పనులకు కొన్ని నెలలుగా ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు.. ఇప్పటికే మనలో చాలా మంది అప్పులపాలై అవస్థలు పడుతున్నారు.. అసలు ప్రాణాలే పోయే రోజులు దాపురించాయి. ఇక నుంచి కొత్త పనులు చేద్దామా? వద్దా? ఆలోచించి చెప్పండి’ అంటూ తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రెడ్డి రాష్ట్రంలోని కాంట్రాక్టర్లకు సూచించారు. ‘అందరూ ప్రశాంతంగా ఆలోచించి మన ప్రయాణం ఎలా చేయాలో సూచనలు చేయండి’ అని కోరారు.
ఈ మేరకు తోటి కాంట్రాక్టర్లకు డీవీఎన్ రెడ్డి చేసిన ఓ పోస్ట్ సోషల్‌మీడియా సర్కిళ్లలో వైరల్‌గా మారింది. డీవీఎన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇలా ఉన్నది. ‘విశ్వావసు నామ సంవత్సరం మొదట మన కాంట్రాక్టర్లనే నిరాశపర్చింది. ఇంత చేదు మార్చి 31 మనం మునుపు చూడలేదు. పేమెంట్లు వస్తాయని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. ఇకనైనా మనం మేలొని పనులు చేయాలా? వద్దా? అనే నిర్ణయానికి వచ్చి.. మన దగ్గర సొంత డబ్బు ఉంటే తప్ప పని చేయొద్దు.
మన సొంత డబ్బు వెచ్చించి చేసిన ఆ పని పేమెంట్ అయితేనే తదుపరి పనిచేసేందుకు పూనుకుంటేనే బాగుంటదని నా విన్నపం. టర్నోవర్లు కాదు మనుషులే పోయే రోజులు వస్తున్నాయి. దయచేసి అందరూ ఆలోచించండి. మన ప్రయాణం ఎలా చేయాలో సూచించండి. మనం మన విలాసాల కోసం అప్పులు చేస్తలేం. ప్రజలకు సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వానికి పెట్టుబడి పెడుతున్నాం. ఈ ప్రయాణంలో మనం అప్పలపాలవుతున్నాం. మనం ఆలోచించి ప్రయాణం చేయకపోతే మనల్ని ఎవరూ రక్షించరు. మనం మన సంఘం తరఫున ఎన్నో విన్నపాలు చేసినం. ఇది నా వ్యక్తిగత ఆవేదన. ఒకసారి ఆలోచించండి’ అని ఆ పోస్టులో డీవీఎన్ రెడ్డి పేర్కొన్నారు.