Dubbaka | సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ రెండు పార్టీలను చాలా మంది కార్యకర్తలు వీడగా, తాజాగా మరో 100 మంది కార్యకర్తలు ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పారు. ఈ కార్యకర్తలంతా భారత రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎంపీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థే అని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించి తప్పు చేశామని చాలా మంది గ్రహించారని పేర్కొన్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయొద్దన్న ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలు ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.