హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎన్నికల బందోబస్తుకు 20న వంద కేంద్ర బలగాలు వస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పోలింగ్ సమయానికి ముందుగా అనుకున్నట్టు 200 కేంద్ర బలగాలు రాష్ట్రంలో అడుగుపెట్టనున్నాయి. 2018 ఎన్నికల బందోబస్తు కోసం కేంద్రం నుంచి మొత్తం 280 కంపెనీలు తెలంగాణకు రాగా, ఆ సంఖ్యను ఇప్పుడు 300కు పెంచారు. తెలంగాణ పోలీసు ఫోర్స్‌తో సహా కేంద్రం నుంచి అదనంగా వచ్చే వివిధ బలగాను రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విధులకు పంపనున్నారు. ఈసారి సరిహద్దు రాష్ర్టాల నుంచి 20 వేల మంది హోంగార్డులను తీసుకుంటున్నట్టు సమాచారం ఉన్నా.. పోలింగ్ నాటికి అదనంగా మరో 5వేల మంది హోంగార్డులు/కానిస్టేబుళ్లను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న 64 వేలకు పైగా సిబ్బందికి తోడు కొత్తగా మరో 25 వేల మంది స్పెషల్ ఫోర్స్‌తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నిక సంఘం, రాష్ట్ర పోలీసుశాఖ ప్రణాళిక రచించింది.