హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో (Congress) చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Defection) తప్పదని భావిస్తున్నారు. అతి త్వరలోనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, న్యాయస్థానమే వారి సభ్యత్వాలను రద్దు చేసి వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. గురువారం పశ్చిమబెంగాల్ రాష్ట్ర హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముకుల్‌రాయ్ ఎన్నికల తర్వాత అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని అక్కడి బీజేపీ నేతలు కోరగా స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టులో కేసు వేయగా, గురువారం తుది తీర్పు ఇస్తూ.. ముకుల్రాయ్పై అనర్హత వేటు వేసింది. సరిగ్గా ఇదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోడంపై గత 21 నెలలుగా న్యాయపోరాటం చేస్తున్నది. స్పీకర్‌కు అనేక సందర్భాల్లో ఫిర్యాదుచేసినా ఆశించిన స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు, అక్కడినుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడమే కాకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫారం ఇచ్చి నిలబెట్టినా స్పీకర్ చర్యలు తీసుకోలేదంటూ అన్ని సాక్ష్యాధారాలతో కోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు జూలై 31వ తేదీన కేసు విచారించి మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. మరో ఇద్దరికి ఇప్పటివరకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు.
బీఆర్ఎస్ ఫిర్యాదులపై తొలుత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పట్టించుకోలేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగడం, సుప్రీంకోర్టు మూడు నెలల గడవు విధించి విచారణ ప్రక్రియను పూర్తిచేయాలని చెప్పడంతో ఇప్పుడు విచారణ మొదలుపెట్టారు. వాస్తవానికి సుప్రీంకోర్టు అక్టోబర్ 31వ తేదీ నాటికే విచారణ ముగించాలని స్పష్టంచేసింది. అయినా స్పీకర్ విచారణను సాగదీస్తూనే ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ కూడా ఆ పార్టీ వ్యక్తే కావడంతో తాము పార్టీ ఫిరాయించినా ఇబ్బందేమీలేదన్న భావనతో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తీరా ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేటు తప్పదని వారికి అర్థమైంది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. న్యాయవాదులను పెట్టుకొని, పత్రికల్లో స్టేట్మెంట్లు ఇస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక తమ పని కూడా అయిపోయినట్టేనని ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మరో నెల రోజుల్లోపే తమ సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉన్నదని తమ అనుచరులతో చెప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు తప్పించుకున్నామని, ఇక తప్పించుకోలేమని వాపోతున్నారట. తమ కేసు సుప్రీంకోర్టులో సోమవారం నాడు సీజేఐ బెంచ్ ముందు విచారణకు వస్తుందని, ఇక వేటు తప్పదన్న నిర్ణయానికి వారు వచ్చినట్టు చెప్తున్నారు.
మరోవైపు, శుక్రవారం స్పీకర్ వద్ద ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగనున్నది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయింపుపై క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నది. ఆ తరువాత శనివారం అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నది. క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసిన తర్వాత స్పీకర్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నది. అయితే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు సంబంధించి ఇప్పటివరకు స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకటించలేదు. మరోవైపు, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను స్పీకర్ జాప్యం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సహా పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై దాఖలైన రిట్పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.
తమపై వేటు తప్పదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిర్ణయానికి వచ్చారట. వారు వారం పది రోజుల్లోనే తమ పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. శుక్రవారం జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే తమ నియోకవర్గాలకు వీలైనంత ఎక్కువ నిధులను సమకూర్చుకుంటున్నారు. తద్వారా తమకు కూడా ఆర్థికంగా ఎంతోకొంత ఉపయోగపడుతాయని, ఒకవేళ పదవి పోయినా ఇబ్బంది లేదని, ప్రజల ముందు తిరిగేందుకు వీలు కలుగుతుందని చెప్తున్నారట. స్పీకర్ లేదా న్యాయస్థానం తమపై వేటు వేయడానికి ముందే సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కూడా చెప్పినట్టు సమాచారం.