మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:30:39

‘గుర్తింపు’ పార్టీలకు 10 మంది స్టార్‌ క్యాంపెయినర్లు

‘గుర్తింపు’ పార్టీలకు 10 మంది స్టార్‌ క్యాంపెయినర్లు

  • రిజిస్టర్డ్‌ పార్టీలకైతే ఐదుగురికి అనుమతి 
  • రేపటిలోగా వారి వివరాలు సమర్పించాలి: ఎస్‌ఈసీ
  • ప్రచారంపై మార్గదర్శకాలు జారీ 

హైదరాబాద్‌, నమ స్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు పార్టీలు తమ స్టార్‌ క్యాంపెయినర్స్‌ (ప్రచారకులు) వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సూ చించారు. గుర్తింపు పొందిన పార్టీలకు 10 మంది స్టార్‌ ప్రచారకులు, రిజిస్టర్డ్‌ పార్టీలకు ఐదుగురు స్టార్‌ ప్రచారకులకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలు జారీచేశారు. గతంలో గుర్తింపున్న పార్టీలకైతే ఐదుగురు, రిజిస్టర్డ్‌ పార్టీలైతే ఇద్దరు స్టార్‌ ప్రచారకులు ఉండే వారని, రాజకీయ పార్టీల విజ్ఙప్తి మేరకు స్టార్‌ క్యాంపెయినర్ల పరిమితిని పెంచినట్లు పార్థసారథి తెలిపారు. ప్రచారకుల జాబితాతో పాటు వారి బయోడేటా, గుర్తింపు కార్డు కాపీలను రేపటి(గురువారం)లోగా ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. 

ప్రచార ఖర్చు అభ్యర్థుల ఖాతాలోకే.. 

రాజకీయ పార్టీలు సూచించిన స్టార్‌ క్యాంపెయినర్ల వాహనాలకు అనుమతి పాస్‌లు జారీ చేయనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపారు. దాన్ని వాహన అద్దాలపై అతికించుకోవాలని సూచించారు. ప్రచారకుల ప్రయాణానికి అయ్యే ఖర్చును పార్టీ ఖర్చుగా  పరిగణిస్తామన్నారు. ఒకవేళ స్టార్‌ ప్రచారకులు నిర్వహించే సభలు, ర్యాలీల్లో పోటీ చేసే అభ్యర్థి పాల్గొన్నా, వేదికను పంచుకున్నా ఆ వ్యయాన్ని అభ్యర్థుల వ్యయంగా జమ కడతామని చెప్పారు. ప్రచారంలో ఒక్కరి కంటే ఎక్కువ అభ్యర్థులు పాల్గొన్నట్లయితే ఆ ఖర్చును సమానంగా విభజించి లెక్కిస్తామని పార్థసారథి స్పష్టం చేశారు.